కస్టోడియల్ విచారణ చేయాల్సిందే : సీబీఐ

అవినాష్ రెడ్డి రాజకీయంగా బలవంతుడని అన్న సీబీఐని కోర్టు ఎదురుప్రశ్నించింది. రాజకీయ బలం ఉన్నప్పుడు అవినాష్ కు..

Update: 2023-05-27 06:35 GMT

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో సీబీఐ వాదనలు ప్రారంభమయ్యాయి. వివేకా హత్యకు కుట్ర, అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ, బెయిల్ నిరాకరణ అంశాలపై సీబీఐ వాదిస్తోంది. అవినాష్ రెడ్డి వివేకా హత్యకేసులో విచారణకు సహకరించడం లేదని, ఎన్నిసార్లు విచారణకు రావాలని నోటీసులిచ్చినా ఏదొక కారణం చెప్పి తప్పించుకుంటున్నాడని సీబీఐ తరపు న్యాయవాది అనిల్ కోర్టుకు తెలిపారు. కోర్టులో పిటిషన్లు వేస్తూ, విచారణలో జాప్యం కలిగేలా వ్యవహరిస్తున్నారని, కేసు దర్యాప్తులో జాప్యం చేసి లబ్ధిపొందాలని చూస్తున్నాడని ఆరోపించారు.

కాగా.. అవినాష్ రెడ్డి రాజకీయంగా బలవంతుడని అన్న సీబీఐని కోర్టు ఎదురుప్రశ్నించింది. రాజకీయ బలం ఉన్నప్పుడు అవినాష్ కు వివేకా చంపే అవసరం ఏముంటుందని ప్రశ్నించింది. విచారణలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది ? సామాన్యుల విషయంలో అయితే ఇలాగే వ్యవహరిస్తారా? అని సీబీఐని కోర్టు ప్రశ్నించగా.. అతను అడుగడుగునా అంతరాయాలు సృష్టిస్తున్నాడని సీబీఐ తరపు న్యాయవాది వివరించారు. అవినాష్ ఇష్టప్రకారం విచారణ చేయలేమన్న సీబీఐ.. తమ విధానం ప్రకారమే దర్యాప్తు ఉంటుందని తెలిపింది. అవినాష్ ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని వెల్లడించింది.
వివేకా హత్యకు నెలరోజుల రోజుల ముందే కుట్ర జరిగిందని, రాజకీయ కోణంలోనే హత్య చేయబడ్డారని సీబీఐ వాదించింది. వివేకాతో అవినాష్ కుటుంబానికి రాజకీయ విభేదాలు ఉన్నాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించేందుకు కుట్ర జరిగిందని అన్నారు. అవినాశ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది. సీబీఐ ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేశ్ వర్మ, వివేకా కూతురు సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కోర్టులో వాదనలను వింటున్నారు. నిన్న అవినాష్, సునీత తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు.




Tags:    

Similar News