భయమా? వ్యూహమా?

నిన్న మొన్నటి వరకూ విచారణకు సహకరిస్తామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చివరి నిమిషంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు

Update: 2023-03-16 07:18 GMT

నిన్న మొన్నటి వరకూ విచారణకు సహకరిస్తామన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చివరి నిమిషంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఒక గంటలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉండగా తాను హాజరు కాలేనని సమాచారం పంపారు. నిన్న మొన్నటి వరకూ కల్వకుంట్ల కవిత విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనకు ఎంత మాత్రం ప్రమేయం లేదని కూడా కవిత తెలిపారు. అలాంటి కవిత ఒక్కసారిగా ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

చివరి నిమిషంలో...
ఉదయం నుంచి కవిత, కేటీఆర్, హరీశ్‌రావు న్యాయవాదులతో చర్చలు జరిపిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈడీ ఎదుట ఈరోజు హాజరయితే అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావించి కవిత తాను ఈరోజు హాజరు కాలేరని చెప్పారా? నిజానికి ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణకు వస్తుంది. ఈడీ విచారణపై తనకు స్టే ఇవ్వాలని, తనపై అధికారుల థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తున్నారంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తనకు అనుకూలంగా భావించి కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు.
నాటకీయ పరిణామాలు...
నిజానికి ఉదయం నుంచే ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈడీ కార్యాలయానికి బయలుదేరే ముందు తాను మీడియా సమావేశం నిర్వహిస్తానని సమాచారం ఇచ్చారు. కానీ న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత కవిత నిర్ణయం మార్చుకున్నారు. మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. తాను విచారణకు హాజరుకాలేనంటూ తన పార్టీ ప్రతినిధి చేత ఈడీ అధికారులకు సమాచారం పంపారు. అయితే కవిత చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం పట్ల రాజకీయ పార్టీలో రెండు రకాలుగా చర్చ జరుగుతుంది.
రెండు రకాల వాదనలు...
ఒకటి తాను తప్పు చేయకపోతే ఎందుకు విచారణకు హాజరయ్యేందుకు హాజరుకాలేనని చెప్పారు? నిన్నటి వరకూ తాను విచారణకు సహకరిస్తానని చెప్పిన కవిత ఇప్పుడు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? అన్నది కొందరి ప్రశ్న. అయితే తనపై కావాలని కేసులు బనాయించి, అక్రమంగా అరెస్ట్ చేయడానికి ఈడీ ప్రయత్నిస్తున్న కారణంగానే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని, కోర్టు తీర్పు ప్రకారం తాము నడుచుకుంటామని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. ఇద్దరి వాదనల్లో నిజమున్నప్పటికీ కవిత మాత్రం ఈరోజు హాజరయితే తనను అరెస్ట్ చేస్తారని విచారణకు హాజరు కాకుండా సమయం తీసుకున్నారంటున్నారు. అయితే కవిత తరుపున న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.


Tags:    

Similar News