ఆయనంటే ఎందుకంత భయం?

ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ రెండూ మోదీ ని ఎదిరించే సాహసం చేయలేకపోతున్నాయి.

Update: 2021-12-03 07:43 GMT

ఆంధ్రప్రదేశ్ కు సమస్యలే లేవా? కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అంశాలే దొరకలేదా? ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలైన టీడీపీ, వైసీపీ రెండూ మోదీ ని ఎదిరించే సాహసం చేయలేకపోతున్నాయి. కనీసం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో గళమెత్తేందుకు అడుగు వేయలేకపోతున్నాయి. ఈ దుస్థితి ఆంధ్రప్రదేశ్ ను మరింతగా దిగజారుస్తుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. పొరుగున ఉన్న తెలంగాణను చూసైనా నేర్చుకుంటే బాగుంటుందన్న సూచనలు వైసీపీ, టీడీపీ అధినేతలకు అందుతున్నాయి.

ఇద్దరిదీ....
ఇద్దరికీ ఒక్కటే టార్గెట్. అది రాజకీయం. తాము పై చేయి సాధించడం. ఏపీలో సీఎం కుర్చీని పదిలం చేసుకోవాలని ఒకరు, తిరిగి దక్కించుకోవాలని మరొకరు రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు. ఇద్దరు బాగోతాన్ని చూసిన బీజేపీ బిందాస్ గా ఉంది. నిజంగా ఏపీలో బీజేపీ స్ట్రాంగ్ గా లేదు. భవిష్యత్ లో బలపడుతుందన్న నమ్మకమూ లేదు. అయితే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కు ఇక్కడి నుంచి ఏ పార్టీ మద్దతివ్వదని భావించిన బీజేపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో దాటవేత ధోరణిని అవలంబిస్తుంది.
బీజేపీ ధీమా అదే...
వచ్చే ఎన్నికల్లో తమకు ఇద్దరిలో ఎవరినుంచైనా తమకు మద్దతు లభిస్తుందన్న ధీమా కేంద్రం పెద్దల్లో కన్పిస్తుంది. ఇక ముఖ్యమంత్రి జగన్ విషయానికి వస్తే ఆయనకు ప్రత్యర్థి పార్టీలను అణిచివేయడం తప్ప మరేదీ పట్టదు. పూర్తి సమయాన్ని అందుకే వెచ్చిస్తున్నారు. విపక్షనేత చంద్రబాబు కూడా అంతే. జగన్ పై విమర్శలు చేయడం మినహా ఆయనకు మరో పనిలేకుండా పోయింది. పార్టీని బలోపేతం చేసుకోవడం, వచ్చే ఎన్నికలలో గెలవడం ఎలా? అన్న దానిపై ఆయన ఫోకస్ ఉంది. దీంతో రాష్ట్ర సమస్యలను అధికార, విపక్ష నేతలు పట్టించుకోవడం లేదు.
పార్లమెంటు సమావేశాల్లో....
పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా కనీసం మోదీ సర్కార్ ను నిలదీసే సాహసం చేయలేకపోతున్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వంటి అంశాలపై సభను స్థంభింప చేసే ప్రయత్నం చేయడం లేదు. వరి ధాన్యం కొనుగోలు పై టీఆర్ఎస్ ఎంపీలు గత ఐదు రోజులుగా ఉభయ సభల్లో ఆందోళన చేస్తున్నారు. కానీ మన వైసీపీ, టీడీపీ ఎంపీలు మాత్రం ప్రశ్నలు వేయడం మినహా ఎలాంటి నిరసనలు తెలియజేయడం లేదు. రాష్ట్రం ఇక ఏ గతిన బాగుపడుతుంది?


Tags:    

Similar News