బెజవాడ సైకిల్ బ్యాచ్ .. బరి గీసి మరీ...?

బెజవాడ టీడీపీ నేతలు ఆధిపత్యం కోసం పెద్దయెత్తున పోరాటం చేస్తున్నట్లే కన్పిస్తుంది. బెజవాడ టీడీపీలో అనేక గ్రూపులున్నాయి.

Update: 2022-01-25 03:03 GMT

బెజవాడ టీడీపీ నేతలు ఆధిపత్యం కోసం పెద్దయెత్తున పోరాటం చేస్తున్నట్లే కన్పిస్తుంది. బెజవాడ టీడీపీలో అనేక గ్రూపులున్నాయి. ఏ గ్రూపుతోనూ మరొక గ్రూపునకు పడదు. ముఖ్యంగా పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని, ఇతరుల మధ్య ఈ అంతర్గత వార్ చాలా కాలం నుంచి నడుస్తుంది. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క గ్రూపు తమ చేతులోకి తీసుకుని ఆధిపత్యం ప్రదర్శించాలని భావిస్తున్నట్లే కనపడుతుంది. కేశినేని నాని ఒక వర్గంలో ఉండగా, బుద్దా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరాలు మరొక వర్గంగా ఉంటున్నారు.

కేశినేని నానికి....
చంద్రబాబు ఇటీవల కేశినేని నానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. నగర పార్టీలోనూ కేశినేని వర్గీయులకే పెద్దపీట వేశారు. దీంతో బుద్దా వెంకన్న వర్గం కొంత సైలెంట్ గా ఉంది. టీడీపీలో ఉన్నప్పటికీ కేశినేని నాని విషయంలో తాము సహకరించేది లేదని బుద్దా వెంకన్న వర్గీయులు చెబుతున్నారు. ఇటీవల వంగవీటి రాధా హత్య కు రెక్కీ జరిగిందన్న విషయంలో కేశినేని నాని ముందున్నారు. రాధాను పరామర్శించడమే కాకుండా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
రాధా ఎపిసోడ్ లో....
రాధా ఎపిసోడ్ లో బుద్దా వెంకన్న, బొండా ఉమలు దూరంగా ఉన్నారు. కేశినేని ఎంటర్ కావడంతోనే వారు ఈ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు. ఇక కొడాలి నాని క్యాసినో వ్యవహారంలో కేశినేని నాని సైలెంట్ గా ఉన్నారు. దీంతో బొండా ఉమ, బుద్దా వెంకన్నలు ఈ అంశాన్ని అందిపుచ్చుకున్నారు. గుడివాడకు వెళ్లిన నిజనిర్ధారణ కమిటీలో బొండా ఉమ ఉన్నారు. ఈ సందర్భంగా బొండ ఉమ కారు కూడా ధ్వంసమయింది. తనపై హత్యాయత్నం జరిగిందని బొండా ఉమ ఆరోపించారు.
క్యాసినో విషయంలో.....
అదే సమయంలో ఇదే అంశంపై బుద్దా వెంకన్న కొడాలి నాని, డీజీపీలను తిట్టిన తిట్టకుండా తిట్టారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు మెప్పు పొందడం కోసమే బెజవాడ నేతలు ఒక్కో అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది. ఒకరు ఎంటర్ అయిన అంశంలో మరొకరు ఎంటర్ కాకుండా తాము హైలెట్ అయ్యేందుకు బెజవాడ సైకిల్ బ్యాచ్ తపనపడుతుంది. మొత్తానికి బెజవాడ టీడీపీలో వైసీపీపై పోరుకన్నా పార్టీలో ఆధిపత్యం కోసం చేసే పోరాటమే ఎక్కువగా కన్పిస్తుంది.


Tags:    

Similar News