"నారా"యణ... ఇక దారేదీ?

ఏపీ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, బీజేపీ పొత్తు ఖరారు కావడంతో కమ్యునిస్టులు మరో దారి చూసుకోవాల్సిందే

Update: 2023-06-05 05:42 GMT

అంతా తెలుసు. టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం నాలుగేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారని అందరికీ తెలిసిందే. కానీ కమ్యునిస్టులు మాత్రం ఆ వాసన పసిగట్టలేకపోయారు. ముఖ్యంగా సీపీఐ మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది. ఈసారైనా తమ పార్టీ శాసేనసభలో కనిపించాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు వెంట పరుగులు తీసింది. పొత్తులతో ఒక్క స్థానమైనా గెలుచుకోవచ్చని భావించి చంద్రబాబును గుడ్డిగా నమ్మింది. ఆయనను అనుసరించింది. రాజధాని అమరావతి నుంచి అన్ని విషయాల్లోనూ చంద్రబాబుకు అండగా నిలిచింది. ఇక టీడీపీ, జనసేనతో కలసి తాము పోటీ చేస్తే తమకు పదేళ్ల తర్వాతైనా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీటు రిజర్వ్ అయినట్లేనని భ్రమించింది.

నాలుగేళ్లు కలసి నడిచి...
అయితే నాలుగేళ్లు కమ్యునిస్టులతో కలసి నడిచిన చంద్రబాబు ఇప్పుడు వారి నుంచి దూరమయ్యేటందుకు రెడీ అయిపోతున్నారు. బీజేపీ నేతలతో సమావేశం దీనికి సంకేతంగా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ బీజేపీతో పొత్తు కుదిరితే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుతోనే ఎన్నికలకు వెళతాయి. కమ్మునిస్టులను పూర్తిగా పక్కన పెడతారు. ఆయన పక్కన పెట్టడం కాదు. కమ్యునిస్టులే బీజేపీ ఉన్న కూటమికి దూరంగా ఉంటారు. చంద్రబాబు కూటమిలోకి పైకి ఆహ్వానించినా వీరు వెళ్లలేరు. చివరకు అదే జరిగేది. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా ఏపీలో కమ్యునిస్టులకు వచ్చే ఎన్నికల్లో కష్టకాలమే.
కాంగ్రెస్ తో కలవడం తప్ప...
వైసీపీకి దగ్గర కాలేరు. ఇటు బీజేపీ ఉన్న కూటమిలోకి చేరలేరు. ఇక వారు పొత్తుతో బరిలోకి దిగదలచుకుంటే కాంగ్రెస్‌తోనే. ఏమీ లేని కాంగ్రెస్, అసలు ఏమీ లేని కమ్యునిస్టులు కలిసినా ప్రయోజనం ఎంత వరకూ ఉంటుందన్నది అంచనా వేయడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే చంద్రబాబును నాలుగేళ్ల నుంచి నమ్ముకున్న కమ్యునిస్టులకు చివరకు రోడ్డున పడాల్సి వస్తుందని ఊహించి ఉండరు. బీజేపీ చంద్రబాబును కలుపుకోదనే భావించారు. వారి నమ్మకం నిజమవుతుందా? వమ్మవుతుందా? అన్నది త్వరలోనే తెలియనుంది. కానీ చివరి నిమిషంలో బీజేపీ స్నేహ హస్తం అందించినా చంద్రబాబు వెంటనే చేయి అందిస్తారు. కమ్యునిస్టులకు హ్యాండ్ ఇస్తారు. అది మాత్రం గ్యారంటీ.
జెండాలను దాచిపెట్టడమే...
ఇన్నాళ్లూ చంద్రబాబు పార్టీ చేసిన పోరాటంలో పాల్గొన్న కామ్రేడ్లకు చివరకు దారి కూడా కనిపించడం లేదు. తెలంగాణలోనూ బీఆర్ఎస్ తమను కలుపుకుని వెళుతుందా? లేదా? అన్న అనుమానం ఉండనే ఉంది. సాధారణ ఎన్నికలు కావడంతో కేసీఆర్ ఎంత మేరకు అంగీకరిస్తారన్నది చూడాలి. ఇక ఏపీలో బీజేపీతో పొత్తు కుదిరితే అక్కడ కూడా అవకాశం చేజారినట్లే. రెండు చోట్ల శాసనసభలో ప్రాతినిధ్యం అనేది ఈసారి కూడా కష్టంగానే మారుతుంది. పాపం... నారాయణ ఎంత రెండు పార్టీలూ కలవకూడదని కోరుకున్నా...జరిగే వాటిని ఆపే శక్తి ఆయనకు లేదు. మౌనంగా మరోసారి అక్కడా ఇక్కడా పోటీ చేసి ఎర్రజెండాలను పార్టీ కార్యాలయంలో దాచిపెట్టుకోవడమే తప్ప. మరొకటి నారాయణ టీం చేసేదేమీ లేదన్నది వాస్తవం. అందుకే సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నించాలి. మరొకరి చేయి పట్టుకుని నడవాలంటే మధ్యలో వదిలేస్తే... ఏంటన్నది కూడా ఘనమైన కామ్రేడ్లు ఇకనైనా ఆలోచించుకుంటే మంచిది.


Tags:    

Similar News