ఇక అంతా జగన్ చేతిలోనే?

పదమూడు లక్షల మందితో నేరుగా జగన్ వైరాన్ని పెట్టుకున్నారు. కోరి తలనొప్పి తెచ్చి పెట్టుకున్నారు.

Update: 2022-02-04 13:09 GMT

జగన్ కు రాజకీయంలో పండిపోయారన్నారు. తనకు ప్రత్యర్థి అంటూ లేకుండా చేసుకున్నాడన్నారు. మరో ముప్ఫయి ఏళ్ల వరకూ జగన్ సీఎంగా ఉంటారని గొప్పలు చెప్పారు. కానీ జరుగుతున్నదేమిటి? ఉద్యోగులు సంఘటితమయ్యారు. కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. అయినా జగన్ లో మార్పు కనపడటం లేదు. పదమూడు లక్షల మందితో నేరుగా జగన్ వైరాన్ని పెట్టుకున్నారు. కోరి తలనొప్పి తెచ్చి పెట్టుకున్నారు. అధికారుల మీద ఆధారాపడితే ఇలాగే ఉంటుంది.

అధికారులపైనే....?
జగన్ మొండివాడన్నది అందరికీ తెలిసిందే. అయితే రాజకీయల్లో పట్టువిడుపులు ఉండాలి. అన్ని చోట్లా తన మాటే నెగ్గాలనుకోవడం సాధ్యం కాదు. ముఖ్యమంత్రి జగన్ నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆయన పూర్తిగా అధికారులు అందించిన లెక్కలపైనే ఆధారపడ్డారు. అదే ఇప్పుడు కొంప ముంచేటట్లు కనపడుతుంది. ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కారం అయ్యేంత వరకూ మెట్టు దిగే అవకాశాలు లేవు.
జుట్టు చేతికి అందించారా?
అయితే ఇప్పుడు ఉద్యోగుల సమ్మె విపక్షాలకు కలసి వచ్చినట్లే కనపడుతుంది. జగన్ ప్రత్యర్థుల చేతికి జుట్టు ఇచ్చారన్నది వాస్తవం. ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగం. దాదాపు యాభై లక్షల మంది ఉద్యోగులు, పింఛనుదారులు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారంతా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకమయితే జగన్ అధికారం నుంచి తట్టాబుట్టా సర్దుకోక తప్పదు. ఉద్యోగులు ప్రధానంగా అడుగుతున్న డిమాండ్లు. పీఆర్సీని పది సంవత్సరాలకు పెంచడం. హెచ్ఆర్ఏ శ్లాబ్ లను తగ్గించడం. ఇంటీరియం రిలీఫ్ కంటే ఫిట్ మెంట్ తక్కువగా ఇవ్వడం. ఈ డిమాండ్లపై జగన్ నేరుగా చొరవ చూపితేనే సమస్యకు పరిష్కారం లభ్యమవుతుంది.
పునరాలోచన చేయరా?
ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు లోటు పాట్లు ఉంటాయి. అసంతృప్తులు సహజంగానే వినపడతాయి. నిర్ణయంపై పునరాలోచన, పునస్సమీక్ష తప్పేమీ కాదు. అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులే తమ నిర్ణయాలను పునస్సమీక్షించుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికైనా జగన్ ఈ సమస్యపై నేరుగా స్పందించాలి. అప్పుడే దీనికి ముగింపు లభిస్తుంది. లేకుంటే పరిస్థితి మరింత జటిలమయ్యే అవకాశముందన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. జగన్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల డిమాండ్లపై కొద్దిసేపటి క్రితం అధికారులతో చర్చించారు. మరి సమ్మె కు ఫుల్ స్టాప్ పడేదిశగా జగన్ ఆలోచనలు మారయేమో చూడాల్సి ఉంది.


Tags:    

Similar News