"అనంత" కు ఈ ముప్పు అందువల్లనేనా?

వరదలకు అనంతపురం పట్టణం అతలాకుతలమవుతుంది. నగరంలోని అనేక కాలనీలు నీట మునిగాయి వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు

Update: 2022-10-13 13:16 GMT

అనంతపురానికి ఎప్పుడైనా వరద చూశామా? ఎంత వర్షం పడినా పట్టణంలోకి నీరు వస్తుందా? అసలు వర్షమే కురవని ప్రాంతంలో ఈ వరదలేమిటి? ప్రకృతి విపత్తుకు అనంతపురం పట్టణం అతలాకుతలమవుతుంది. నగరంలోని అనేక కాలనీలు నీట మునిగాయి వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. పునరావస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. నడిమివంక ఉధృతి కారణంగా 20 కాలనీలు నీట మునిగాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ తక్షణ సాయం కింద ఒక్కొక్క కుటుంబానికి రెండు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

సీమలో ఈ పరిస్థితి...
సాధారణంగా తుపాను, వరదలు కోస్తా ప్రాంతంలో వింటుంటాం. రాయలసీమలో అతి తక్కువగా ఈ పరిస్థితి కనపడుతుంది. అందునా అనంతపురం వంటి ప్రాంతంలో మూడు దశబ్దాల తర్వాత ఇటువంటి వరదలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. 32 ఏళ్ల క్రితం ఇలాగే వరదలు వచ్చి కొంత ఆస్తి నష్టం జరిగిందని అంటున్నారు. ఇళ్లలో వస్తువులన్నీ నీటమునిగాయి. కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలి పోవాల్సి వచ్చింది. ప్రభుత్వ సాయం ఎంత చేసినా వీరు ఇప్పట్లో కోలుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.


ఆక్రమణల వల్లనేనా?
ముంపు ప్రాంతాల ప్రజలందరినీ అధికారులు ఖాళీ చేయించారు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి అధికారులను, సిబ్బందిని రప్పించి పర్యవేక్షిస్తున్నారు. ఈ ముంపునకు ప్రధాన కారణం అక్రమ నిర్మాణాలేనని అంటున్నారు. గత కొంతకాలంగా జరిగిన అక్రమ నిర్మాణాల కారణంగానే ఇళ్లన్నీ నీటమునిగాయని చెబుతున్నారు. ఎన్టీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. రాత్రయితే చాలు మళ్లీ కుంభవృష్టి కురుస్తుందేమోనన్న టెన్షన్ అనంతపురం పట్టణంలో నెలకొంది.
చెరువులు తెగి...
కరువుకు ప్రాంతమైన అనంతపురంలో ఈ వరదలేమిటి? అన్నది ఆశ్చర్యకరంగా ఉంది. ఎగువ ప్రాంతంలోని చెరువులు తెగిపోయి ఊరిమీద వరదనీరు పడింది. యాలేరు, ఆలమూరు చెరువుల నుంచి వచ్చిన నీరు అనంతపురంపై పడింది. నడిమివంక కు భారీగా నీటి ప్రవాహం వచ్చి చేరడంతో నగరంలో పలు కాలనీల్లోకి వరద నీరు ప్రవేశించింది. అనంతపురంలోని సోమనాథనగర్, రంగస్వామి నగర్, రుద్రంపేట పంచాయతీ, యువజన కాలనీలుపూర్తిగా మునిగిపోయాయి.ఈరోజు కూడా వర్షం కురుస్తుందేమోనని బితుకు బితుకు మంటూ బతుకుతున్నారు.


Tags:    

Similar News