పొత్తులపై పవన్ పెదవి విప్పేది అప్పుడేనట

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి.

Update: 2022-01-08 06:10 GMT

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయన తీసుకునే నిర్ణయంపైనే మిగిలిన పార్టీల భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తుకు తహతహలాడుతుంది. కిందిస్థాయి నుంచి అగ్ర స్థాయి నేతల వరకూ పవన్ కల్యాణ్ తో ప్రయాణించాలని కోరుకుంటున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. గత ఎన్నికల్లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. ఒకరు జనసేన నుంచి విజయం సాధించారు.

కిందిస్థాయి క్యాడర్....
మిగిలిన 151 నియోజకవర్గాల్లో కూడా జనసేనతో పొత్తు ఉండాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. పవన్ తో పొత్తుపై త్వరలోనే స్పష్టత ఉంటుందని చెబుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు పొత్తులపై పవన్ కల్యాణ్ పెదవి విప్పే అవకాశముంది. ఈ మేరకు పార్టీ నేతలు లీకులు ఇస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 14వ తేదీన జరగనుంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పొత్తులపై స్పష్టత ఇచ్చే అవకాశముంది.
బీజేపీకి దూరంగా....
అయితే పరిస్థితులను గమనిస్తే పవన్ కల్యాణ్ కు, బీజేపీకి మధ్య దూరం పెరుగుతున్నట్లే కన్పిస్తుంది. బద్వేలు ఉప ఎన్నిక నాటి నుంచే ఈ దూరం మొదలయిందని చెప్పాలి. బద్వేలు ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబితే బీజేపీ బరిలోకి దిగింది. పవన్ మిత్రపక్షం విజయం కోసం కనీసం ప్రచారానికి కూడా రాలేదు. తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై ఒకరోజు ధర్నాకు దిగడం కూడా బీజేపీ లో చర్చనీయాంశంగా మారింది.
పవన్ ప్రకటనలు....
అవసరమైతే పొత్తులపై సమీక్షిస్తామని గతంలోనే పవన్ కల్యాణ్ చెప్పారు. కమ్మ వర్గానికి వైసీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ఇలా బీజేపీ వ్యతిరేక, టీడీపీ అనుకూల ప్రకటనలు పవన్ చేస్తుండటంతో ఆయన పార్టీ ఆవిర్భావ సభలో ఏం చెప్పనున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా టీడీపీ అనుకూల వైఖరే ఉంటుందని, అవసరమైతే బీజేపీని కలుపుకుని పోయే ప్రయత్నం పవన్ చేస్తారని చెబుతున్నారు. మొత్తం మీద మరో రెండు నెలల్లో పవన్ పొత్తులపై స్పష్టత ఇచ్చే అవకాశముంది.


Tags:    

Similar News