ఢిల్లీకి చేరిన రెండో విమానం.. స్వదేశానికి తెలుగు విద్యార్థులు

250 మందిలో 17 మంది తెలంగాణకి చెందిన విద్యార్థులు , 11 మంది ఏపీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఏపీ విద్యార్థులను ఢిల్లీ నుంచి..

Update: 2022-02-27 06:12 GMT

న్యూ ఢిల్లీ : రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం నాల్గవ రోజుకు చేరింది. అక్కడ జరుగుతున్న భీకర యుద్ధంతో.. భారత్ నుంచి చదువుకోసం ఉక్రెయిన్ కు వెళ్లిన తమ పిల్లలు ఎలా ఉన్నారో అని తల్లిండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందవద్దంటూ కేంద్ర ప్రభుత్వం.. ఆపరేషన్ గంగా పేరుతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయుల్ని వెనక్కి తీసుకొచ్చేందుకు ముమ్మర చర్యలు మొదలుపెట్టింది. ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులను తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే అక్కడికి విమానాలను పంపగా.. తొలుత 219 మందితో కూడిన విమానం ఢిల్లీకి చేరుకుంది.

శనివారం రాత్రి 250 మందితో కూడిన మరో విమానం దేశ రాజధాని ఢిల్లీకి సురక్షితంగా చేరుకుంది. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిర్ ఇండియా విమానం 250 మంది భారత విద్యార్థులతో ఢిల్లీకి చేరుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్ విద్యార్థులకు స్వాగతం పలికారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను రిసీవ్ చేసుకునేందుకు ఏపీ, తెలంగాణ భవన్ అధికారులు ముందుగానే ఢిల్లీ ఎయిర్ పోర్టుకు చేరుకుని వారికి స్వాగతం పలికారు. 250 మందిలో 17 మంది తెలంగాణకి చెందిన విద్యార్థులు , 11 మంది ఏపీకి చెందిన విద్యార్థులు ఉన్నారు. ఏపీ విద్యార్థులను ఢిల్లీ నుంచి నేరుగా ఏపీకి వెళ్లే విమానాల్లో వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.



Tags:    

Similar News