నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం ఒద్దిపట్ల పడమటితండా వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఏఎంఆర్పీ కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో సుమారు 30 మంది వ్యవసాయ కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ లో ఒద్దిపట్ల నుంచి వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలను పొలాలకు తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని పలువురిని రక్షించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వడంతో వారు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 8 మంది మృతదేహాలను స్థానికుల సాయంతో వెలికి తీశారు. కాల్వలో నీటి ఉధృతి అధికంగా ఉండటంతో కొంతమంది కూలీలు నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. మృతులు రమావత్ సోన (70), రమావత్ జీజా (65), జరుకుల ద్వాలి (30), రమావత్ కెలి (50), రమావత్ కంసలి (50), బానవత్ బేరి (55), రమావత్ భారతి (35), రమావత్ సునీత(30)గా గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.