Bandi Sanjay : కుటుంబ సభ్యులతో ప్రమాణం చేస్తా... ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ విచారణ కు అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు
ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ విచారణ కు అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అనేక మంది రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయన్నారు. కొన్ని నెలల నుంచి ఫోన్ ట్యాపింగ్ పై సిట్ విచారణ జరుపుతున్నప్పటికీ ఎటువంటి పురోగతి లేదన్నారు. వాస్తవాలను బయటకు తీసి అందుకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారో వారితో పాటు ట్యాపింగ్ కు పాల్పడిన వారిని వదిలిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ముంబయికి పంపిన డబ్బు...
గత ప్రభుత్వంలో కనీసం తమ కుటుంబసభ్యుల ఫోన్లను కూడా వదిలిపెట్టలేదన్నారు. ఉప ఎన్నిక జరిగిన సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ కు బాగా గురయిందని ఆయన తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేస్తారా? అని ప్రభ్నించారు. తాను కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఎక్కడైనా ఏ గుడిలోనైనా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని బండి సంజయ్ తెలిపారు. ఎస్ఐబీ ఉన్నది మావోయిస్టులు కదలికలను పసిగట్టడానికని, ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కాదని ఆయన అన్నారు. మహారాష్ట్ర ఎన్నికలకు ఇక్కడి నుంచి అంత డబ్బు ఎందుకు పంపారని, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు.