Danam Nagender : దానం నాగేందర్ కు కష్టాలు తప్పవా? న్యాయనిపుణులు ఏమంటున్నారు?

బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై అనర్హత కత్తి వేళ్లాడుతుంది

Update: 2025-08-01 12:26 GMT

బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిపై అనర్హత కత్తి వేళ్లాడుతుంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్పీకర్ కూడా దీనిపై స్పందిస్తూ పార్టీని ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తామని తెలిపారు. దీనిపై వారితో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అయితే ఇప్పుడు పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మంది పరిస్థితి వేరు. ఒక్కరి పరిస్థితి వేరుగా ఉంది. అందులో ముఖ్యంగా ఒకరికి మాత్రం అనర్హత వేటు పడే అవకాశం ఎక్కువగా ఉందని న్యాయనిపుణులు కూడా చెబుతున్నారు. అందుకే అందిరి వేళ్లూ ఆయన వైపు చూపుతున్నాయి.

శాసనసభ ఎన్నికల్లో...
2023 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచిన వారిలో మొత్తం పది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి సమక్షంలో పార్టీ కండువాను కూడా కప్పుకున్నారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరకపోయినా వారికి మద్దతుదారుగా నిలిచారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ లు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్లమెంటుకు పోటీ చేసి...
అయితే ఈ పది మందిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిస్థితి మాత్రం అనర్హత విషయంలో ఒకింత సీరియస్ గానే కనపడుతుంది. ఎందుకంటే మిగిలిన ఎమ్మెల్యే లందరూ కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పార్టీ కండువాను మాత్రమే కప్పుకున్నారు. అది పక్కన పెడితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలిచి 2024 లోజరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో దానం నాగేందర్ మాత్రం అడ్డంగా దొరికపోయినట్లయింది. ఎందుకంటే ఎంపీ ఎన్నికల్లో అధికారికంగా పోటీ చేయడంతో ఆయనపై అనర్హత వేటు పడుతుందని అంటున్నారు. దానం మాత్రం వేటు నుంచి తప్పించుకోలేరని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
Tags:    

Similar News