Tummala: తుమ్మల కామెంట్స్ తో ప్రభుత్వం అలెర్ట్ అయిందా? ఒకరికి ఒకచోట రేషన్ కార్డు ఉండేలా?
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల్లో నిజముంది
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యల్లో నిజముంది. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో పథకాలను పొందుతూ, రెండు రాష్ట్రాల రేషన్ కార్డులు ఉన్న వారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడినా అక్కడ సొంత ఇల్లు.. ఇక్కడ ఉపాధి కోసం వచ్చిన వారు రెండు చోట్ల రేషన్ కార్డులు తీసుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అందించే పథకాలు అందుకుంటున్నారు. నిజంగా ఇది దురదృష్టకరమే. ప్రజాధనం పక్కదోవపట్టడమే అవుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. దీనిపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకుని కేవలం ఒక రాష్ట్రంలోనే రేషన్ కార్డులు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉచిత పథకాలు రెండు చోట్ల...
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు మాత్రమే ఉచిత పథకాలు అందాలన్నారు. అప్పుడే ప్రభుత్వ పథకాలకు సార్థకత చేకూరతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చే బియ్యం అమ్ముకునే వారికి ఎందుకు ఇవ్వాలని ఆయన వేసిన ప్రశ్నలో కూడా అర్థం ఉంది. తెలంగాణలో కోటి పది లక్షల కుటుంబలు ఉంటే పొరుగు రాష్ట్రానికి చెందని వారికి కూడా ఇక్కడ రేషన్ కార్డులన్నాయన్నారు. దీనివల్ల అక్కడా, ఇక్కడా బియ్యం తీసుకోవడంతో అవి పక్కదారి పట్టే అవకాశముంది. అదే సమయంలో రెండు చోట్ల పథకాలను అందుకుంటుంటే ప్రభుత్వ ఖజానాపై కూడా భారం పడే అవకాశముంటుంది. ఒకరు ఒక రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలను పేదలు అందుకోవాల్సి ఉంటుంది.
అర్హతలు లేని వారు కూడా...
కానీ అర్హతలులేని వారు కూడా అనేక మంది ఉచితాలు పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రెండుచోట్ల రెండు ఓట్లు ఉన్నాయి. వేర్వేరు సార్లు ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడకు వెళ్లి ఓటేస్తారు. ఇక్కడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్నికల కమిషన్ ఒకే రాష్ట్రంలో ఒకేచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలన్ననిబంధన పెట్టింది. ఇప్పుడు అలాగే పథకాలను కూడా ఎక్కడో ఒకచోట మాత్రమే తీసుకునే అవకాశం కల్పిస్తే నిజమైన పేదలకు పథకాలు అందుతాయి. ప్రభుత్వాలకు కూడా కొంత వెసులుబాటు లభిస్తుందని భావిస్తున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణ జరపాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఒకచోట మాత్రమే రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకుంటే చాలా వరకూ ఖజానా పై భారం తగ్గుతుందని ఉన్నతాధికారులు కూడా చెబుతున్నారు.