New Ration Cards : రేషన్ కార్డుల కోసం ఇంకా పడిగాపులేనా? ఇంకా ఎన్నాళ్లు?
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను మంజూరు విషయంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులను మంజూరు విషయంలో మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు.26 లక్షల మందికి రేషన్ కార్డుల పేర్లు మార్చుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ప్రస్తుతం 3.10 కోట్ల మంది తెలంగాణలో సన్నబియ్యం తింటున్నారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సాధ్యమయిందని ముఖ్యమంత్రి తెలిపారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి పక్షం రోజులు గడుస్తున్నా ఇంకా రేషన్ కార్డులు అందని వారు ఎందరో ఉన్నారని తెలుస్తోంది.
అర్హులకు కూడా...
రేషన్ కార్డులు తమకు అందుతాయేమోనని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. జులై 14వ తేదీన ఆర్భాటంగా ముఖ్యమంత్రి ప్రకటించిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ పురోగతిని ప్రభుత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అర్హత ఉన్నా తమకు తెలుపు రంగు రేషన్ కార్డు అందలేదన్న ఫిర్యాదులు ఎమ్మెల్యేలకు చేరుతుండటంతో వారు తలలు పట్టుకుంటున్నారు. తెలుపు రంగు రేషన్ కార్డుకు డిమాండ్ ఉండటంతో ఎమ్మెల్యేలపైన కూడా వత్తిడి పెరిగింది. నియోజకవర్గంలో పర్యటనలకు వెళ్లిన ఎమ్మెల్యేలను ప్రజలు రేషన్ కార్డుల కోసం నిలదీస్తున్నట్లు అనేక వార్తలు వస్తున్నాయి.
లక్షల సంఖ్యలో ఉండటంతో...
గ్రామ సభలను నిర్వహించి వారి నుంచి అర్జీలను తీసుకున్న తర్వాత అర్హులను నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డు దారులను ఎంపిక చేయడం ద్వారా వారికి అన్నీ ఉచితాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఆగస్టు నెల నుంచి అందే అవకాశముంది. అయితే రేషన్ కార్డుల మంజూరులో అధికారుల అలసత్వం కనిపిస్తుందని అంటున్నారు. గ్రామసభల ద్వారా మాత్రమే కాకుండా మీ సేవ కేంద్రాల ద్వారా కూడా లక్షల సంఖ్యలో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత పదేళ్ల నుంచి తమకు రేషన్ కార్డు లేదని, తమ ఆర్థిక పరిస్థితిని చూసి అందించాలని వారు అధికారులను కోరుతున్నారు. ప కుటుంబంలో ఎంతమంది సభ్యులన్నప్పటికీ ఒక్కొక్కరికీ ఆరు కిలోల సన్నబియ్యం పంపిణీ చేయనుండటంతో వీటికి డిమాండ్ మరింత పెరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరుపై క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకుని అర్హులైన వారందరికీ అందచేయాలని కోరుతున్నారు.