మాదకద్రవ్యాల వాడకాన్ని కూకటివేళ్లతో పెకలించడమే ధ్యేయం : సీఎం కేసీఆర్

నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని

Update: 2022-01-28 12:17 GMT

తెలంగాణలో డ్రగ్స్ వాడకాన్ని సమూలంగా అణచివేసే దిశగా సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రులు, పోలీస్ శాఖలోని ఉన్నతాధికారులు, ఎస్పీలు, డీజీలు, ఎక్సైజ్ శాఖ అధికారులతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణలోంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు బాధ్యత గల పౌరులుగా ఆలోచనలు చేయాలని సూచించారు. సామాజిక బాధ్యతతో ప్రతిఒక్కరి సహకారం తీసుకుంటూ.. సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు.

నార్కోటిక్ డ్రగ్స్ వాడకం అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న దుర్వ్యసనమని, సమాజమనే వేరుకు పట్టిన చీడ పురుగు వంటిదని సీఎం పేర్కొన్నారు. డ్రగ్స్ వాడటం వల్ల కలిగే అనారోగ్య సమస్యలపై ప్రజలను చైతన్య పరిచేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలను డ్రగ్స్ కు వ్యతిరేకంగా చైతన్యం చేసేందుకు సృజనాత్మక కార్యక్రమాలను రూపొందించాలని సీఎం తెలిపారు. 1000 మంది సుశిక్షితులైన పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించుకుని అత్యాధునిక హంగులతో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్" ను ఏర్పాటు చేసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి ని ఆదేశించారు.
ఇప్పటికే పలు అసాంఘిక శక్తులను, వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు ఏర్పాటు చేసుకున్న గ్రే హౌండ్స్ తదితర వ్యవస్థలు విజయవంతం గా పనిచేస్తున్నాయని,అదే మాదిరి, నార్కోటిక్ డ్రగ్స్ ను నియంత్రించే విభాగం కూడా శక్తి వంతంగా తేజోవంతంగా పని చేయాలని సీఎం ఆకాంక్షించారు. అలాగే విధుల నిర్వహణలో అద్భుత పనితీరు కనపరిచే పోలీస్ అధికారులకు అవార్డులు రివార్డులు ఆక్సెలరేషన్ ప్రమోషన్స్ తదితర అన్నిరకాల ప్రోత్సాహకాలను అందించాలన్నారు. అందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దని, ఈ విషయం లో ఏ పార్టీ కి చెందిన వారైనా సరే, నేరస్థులను కాపాడేందుకు ప్రజాప్రతినిధుల సిఫారసులను నిర్ద్వందంగా తిరస్కరించాలని పోలీసు అధికారులకు సీఎం స్పష్టం చేశారు.


Tags:    

Similar News