Telangana : కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో పెర్ ఫార్మెన్స్ అంత బాగాలేదా? సీనియర్లు ఏమంటున్నారంటే?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Update: 2026-02-14 12:42 GMT

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆశించిన రీతిలో ఫలితాలు రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో నిజం లేకపోలేదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తే ఇటువంటి ఫలితాలు రావన్నది వాస్తవం. రెండేళ్లలోనే ఇంత తక్కువ రిజల్ట్ వస్తే మరో మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు ఎలా? అన్న మధనం హస్తం పార్టీ నేతల్లో కనిపిస్తుంది. పైకి ఫలితాలు బాగానే వస్తున్నాయని చెప్పినా.. లోపల మాత్రం లోపం ఎక్కడ ఉందన్న దానిపై కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కూడా ఒక రకంగా ప్రశ్నించుకుంటున్నట్లు తెలిసింది. ఫలితాలు బాగా వచ్చాయని బాహాటంగా చేస్తున్న ప్రకటనలకు లోపల జరుగుతున్న అంతర్గత విశ్లేషణలకు చాలా పొంతన ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పరిశీలించినా ఇదే అర్థమవుతుంది.

బీఆర్ఎస్ ను తక్కువగా అంచనా వేసి...
కాంగ్రెస్ 39.8 శాతం, బీఆర్ఎస్ 28.7, బీజేపీ 15.6, ఏ.ఐ.ఎఫ్.బి 1.5 శాతం, ఎంఐఎం 3.2 శాతం, సీపీఐ 1.3 శాతం, సీపీఎం 05 శాతం ఓట్లు వచ్చాయన్నది ఎన్నికల కమిషన్ తెలిపింది. దీంతో ఓట్ల శాతం పెద్దగా లేకపోవడాన్ని సీనియర్లు ఎత్తి చూపుతున్నారు. బీఆర్ఎస్ ను ఇప్పటికీ తక్కువగా అంచనా వేయడంతో పాటు ఏక నాయకత్వం పనిచేయదని కొందరు సీనియర్ నేతలు అభిప్రాపడుతున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కష్టపడి జిల్లాల్లో పర్యటించినప్పటికీ స్థానిక నేతలు మాత్రం అంత చురుగ్గా పాల్గొనలేదని చెబుతున్నారు. అధికారంలో ఉండటంతో పాటు డబ్బు, మద్యం వంటివి పనిచేయడం వల్లనే ఆ మాత్రం ఫలితాలు వచ్చాయని, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, మంత్రులు కష్టపడిన ఫలితమే ఈ రిజల్ట్ అని కాంగ్రెస్ నాయకులకు బోధపడింది. పట్టణ ఓటర్లలో కొంత వ్యతిరేకత ప్రభుత్వంపై వెల్లడయినట్లు ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయని అర్థం చేసుకోవాలని, గెలిచామని జబ్బలు చరుచుకుని నిర్లక్ష్యంగా ఉంటే సాధారణ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు.
ప్రజలు ప్రత్యామ్నాయం వైపు...
ఇప్పటికీ పార్టీని నమ్ముకుని ఏళ్లుగా ఉన్న వారికి పదవులు దక్కకపోవడంతో పాటు కొందరు నేతలు తిరుగుబాటు చేయడం కూడా చర్చకు వచ్చింది. అలాగే నాలుగు కార్పొరేషన్లలోనే విజయం సాధించడం, కరీంనగర్ కార్పొరేషన్ లో కేవలం పథ్నాలుగు డివిజన్లకే పరిమితమవ్వడం పైన కూడా చర్చ జరుగుతుంది. నిజామాబాద్ కార్పొరేషన్ లోనూ బీజేపీ అత్యధిక స్థానాలను గెలవడంతో పాటు కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను గెలుచుకోకపోవడం, కొత్త గూడెం వంటి చోట కూడా సరిగా పెర్ ఫార్మెన్స్ నేతలు చేయలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో హంగ్ రావడం అంటే ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారన్నది అర్థం కావడం లేదా? అని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా లోపాలను సరిదిద్దుకుని ముందుకు వెళ్లకపోతే.. పదేళ్ల మాట దేవుడెరుగు ఐదేళ్లకే అధికారం ముగుస్తుందన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.



Tags:    

Similar News