ఎమ్మెల్యేల సస్పెన్షన్ పై అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఉత్తర్వులు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండాన్నే ప్రారంభించడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు..

Update: 2022-03-09 11:10 GMT

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ మొదలైన తొలిరోజే.. సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండైన విషయం తెలిసిందే. తమను నిబంధనలకు విరుద్ధంగా సభ నుంచి సస్పెండ్ చేశారంటూ.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో హైకోర్టు తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండాన్నే ప్రారంభించడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. సమావేశం ప్రారంభమవ్వగానే నిరసన తెలిపేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించగా.. కొద్దినిమిషాలకే ముగ్గురు ఎమ్మెల్యేలను మొత్తం బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దాంతో ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స‌భ నియ‌మావ‌ళి, రాజ్యాంగానికి విరుద్ధంగా త‌మ‌ను స‌భ నుంచి స‌స్పెండ్ చేశార‌ని వారు త‌మ పిటిష‌న్‌లో హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. త‌మ సస్పెన్ష‌న్‌కు సంబంధించిన ప్రొసీడింగ్ ఉత్త‌ర్వుల‌ను ఇవ్వ‌మ‌ని కోరినా ఇవ్వ‌డం లేద‌ని కూడా వారు ఫిర్యాదు చేశారు. ఈ పిటిష‌న్‌పై బుధ‌వారం విచార‌ణ జ‌ర‌గ్గా.. అసెంబ్లీ వ్య‌వ‌హారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవ‌ద్ద‌ని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ కోర్టును కోరారు.


Tags:    

Similar News