నాకు ఇగో లేదు... ఫ్రెండ్లీ నేచర్

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు

Update: 2022-04-06 07:15 GMT

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. ఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. తాను వివాదాస్పద వ్యక్తిని కానని చెప్పారు. అందరితో ఫ్రెండ్లీగా ఉండేందుకే ప్రయత్నించానని తమిళి సై చెప్పారు. తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసునని చెప్పారు. తాను స్నేహపూర్వకమైన, రాజ్యాంగ బద్ధమైన వ్యక్తిని అని తమిళిసై చెప్పుకున్నారు. తనకు ఎలాంటి ఇగో లేదని చెప్పారు. రాజ్యాంగాన్ని, రాజ్ భవన్ ను గౌరవించాలని ఆమె కోరారు.

సీఎం ఎప్పుడైనా రావచ్చు....
తనతో భేటి కోసం ముఖ్యమంత్రి ఎప్పుడైనా రాజ్ భవన్ కు రావచ్చని తమిళిసై చెప్పారు. తాను ముఖ్యమంత్రి తో ఏ విషయంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అవసరమైతే బహిరంగ చర్చకు కూడా సిద్దమని చెప్పారు. గవర్నర్ ప్రొటోకాల్ గురించి చీఫ్ సెక్రటరీకి తెలియదా? అని తమిళి సై ప్రశ్నించారు. గవర్నర్ కు ప్రభుత్వం గౌరవం ఇవ్వకపోవడాన్ని వారి విచక్షణకే వదిలేస్తున్నానని చెప్పారు.
ఎవరూ ఆపలేరు....
కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో నియమిస్తూ తన వద్దకు ఫైల్ ను పంపారని, సేవా రంగంలో ఆయన ఎంపిక సరైనది కాదని భావించి ఫైలును ఆపిన మాట వాస్తవమేనని తమిళి సై తెలిపారు. తెలంగాణ ప్రజలకు తానేంటో తెలుసునని చెప్పారు. తెలంగాణలో అధికారం చెలాయించడానికి తాను ఇక్కడకు రాలేదన్నారు. తనను ఎవరూ ఆపలేరని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటానికి తాను చాలా వరకూ ప్రయత్నించానని చెప్పారు. మోదీతో కలిసిన తర్వాత తమిళిసై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు.


Tags:    

Similar News