Telangana : రేషన్ కార్డులకు అర్హులు ఎందరో తెలుసా? అందులో మీ పేరుందా? తెలుసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసే ముహూర్తం ఖరారయింది
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసే ముహూర్తం ఖరారయింది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 2.4 లక్షల మంది కొత్త రేషన్ కార్డుల దారులకు కొత్త కార్డులను ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 11.30 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం చెబుతుంది. తెలంగాణలో గత ఆరు నెలల నుంచి నలభై ఒక్క లక్షల మందికి ప్రభుత్వం రేషన్ కార్డులను మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో రేషన్ కార్డుల దారుల సంఖ్య 95 లక్షల మందికి చేరనుంది. దాదాపు మూడున్నర కోట్ల మందికి లబ్ది చేకూరనుంది.
లక్షల్లో రేషన్ కార్డులు...
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి అంతా సిద్ధం చేసింది. గ్రామ సభలను నిర్వహించి వారి నుంచి అర్జీలను తీసుకున్న తర్వాత అర్హులను నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డు దారులను ఎంపిక చేయడం ద్వారా వారికి అన్నీ ఉచితాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఇక నుంచి అందనున్నాయి. కొత్త రేషన్ కార్డు దారులందరికీ వారికి సంబంధించిన కార్డులను ఈ నెలాఖరులోపు అందనిరీ మంజూరు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రేషన్ కార్డుపై ఆరు కిలోల సన్న బియ్యాన్ని పంపిణీ చేయనుండటంతో కొత్తగా ప్రయోజనం పొందే వారిసంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. కుటుంబంలో నలుగురు సభ్యులుంటే నెలకు ఇరవై నాలుగు కిలోల సన్నబియ్యం అందుతాయి.
సంక్షేమ పథకాలన్నీ...
సన్నబియ్యంతో పాటు ఇక ఆరోగ్య శ్రీ పథకం కూడా తెలుపు రంగు రేషన్ కార్డుదారులకు వర్తింప చేయడంతో వైద్య సాయం కూడా అందుతుంది. దీంతో పాటు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు, ఇందిరమ్మఇళ్లు, ఉచిత విద్యుత్తు వంటి పథకాలు కూడా అందుతుండటంతో తెలుపు రంగు రేషన్ కార్డులకు తెలంగాణలో డిమాండ్ ఏర్పడింది. . గ్రామసభల ద్వారా మాత్రమే కాకుండా మీ సేవ కేంద్రాల ద్వారా కూడా లక్షల సంఖ్యలో ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గత పదేళ్ల నుంచి తమకు రేషన్ కార్డు లేదని, తమ ఆర్థిక పరిస్థితిని చూసి అందించాలని వారు అధికారులను కోరుతున్నారు. ప్రభుత్వం కూడా అర్హులైన పేదలు ఎంత మంది ఉన్నా అందరికీ తెలుపు రంగు రేషన్ కార్డులు అందచేస్తామని తెలిపింది. దీంతో కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా, వారు పెళ్లిళ్లయి బయటకు వెళ్లిపోయినా వారి పేరు మీద కూడా కొత్త రేషన్ కార్డును మంజూరు చేయనున్నారు. మొత్తం మీద ఎల్లుండి నుంచి ఇక రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అర్హులెవరన్నది జనంలో ఉత్కంఠగా మారింది.