Raithu Bharosa : రైతులకు తీపికబురు.. వారి అకౌంట్లోకి డబ్బులు జమ ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధులను మరో వారం రోజుల్లో జమ చేస్తామని తెలిపింది
తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా నిధులను మరో వారం రోజుల్లో జమ చేస్తామని తెలిపింది. ఇప్పటి వరకూ మూడు ఎకరాలున్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను అందచేశారు. అయితే నాలుగు ఎకరాలున్న రైతులకు మరో వారం రోజుల్లో అందచేస్తామని, వారి ఖాతాల్లో నగదును జమ చేయనున్నట్లు అధికారికవర్గాలు వెల్లడించాయి. గత జనవరి 26వ తేదీ నుంచి తెలంగాణలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి. విడతలవారీగా నిధులను జమ చేస్తున్నారు.
పెట్టుబడి సాయం కింద...
రైతులకు పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది. తొలి విడత ఎకరం, తర్వాత రెండు ఎకరాలు, తర్వాత మూడు ఎకరాలున్న రైతులకు ఈపెట్టుబడి సాయం అందించింది. అయితే ఇక వారం రోజుల్లో నాలుగో విడత రైతు భరోసా నిధులను అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలు కూడా రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో వీలయినంత త్వరగా నిధులు జమ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించిన నిధులను సిద్ధం చేసినట్లు తెలిసింది.
విడతల వారీగా...
తెలంగాణలో రైతు భరోసా నిధులు సాగుకు వీలయ్యే అన్ని భూములకు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో దాదాపు1.48 కోట్ల ఎకరాల భూమికి సంబంధించి ఈ రైతు భరోసా నిధులను జమ చేయనున్నారు. ఇప్పటి వరకూ 45లక్షల మంది రైతులకు రైతు భరోసా నిధులున జమ చేసినట్లు అధికారికవర్గాలు వెల్లడించాయి. మిగిలిన వారికి కూడా విడతల వారీగా చెల్లిస్తామని చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా ఐదు ఎకరాలున్న యజమానికి కూడా రైతు భరోసా నిధులు చెల్లించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది.