తెలంగాణలో ఒమిక్రాన్ వ్యాప్తి పై హెల్త్ డైరెక్టర్ కీలక ప్రకటన

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టింది.

Update: 2021-12-05 12:54 GMT

ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టింది. వచ్చినవారికి వచ్చినట్లు కోవిడ్ పరీక్షలు చేసి నెగిటివ్ ఉంటేనే ఇళ్లకు పంపుతున్నారు. పాజిటివ్ వచ్చినవారిని టిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా.. తెలంగాణలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ లో చాలా మంది భయంతో ఆస్పత్రుల్లో చేరి ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని ఎవరో అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి తప్పుడు వార్తలను, పుకార్లను ప్రజలు నమ్మరాదని విజ్ఞప్తి చేశారు.

అసత్య ప్రచారాన్ని....
రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు లేకపోయినప్పటికీ.. అలాంటి కేసులు నమోదయ్యాయని అసత్య ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకుంటామనిహెల్త్ డైరెక్టర్ హెచ్చరించారు. టిమ్స్ కు తరలించిన పేషెంట్ల నమూనాలు జీనోమ్ సీక్వెన్స్ కు ఇవ్వగా.. ఆ రిపోర్టులు సాయంత్రానికి వస్తాయని, అప్పటి వరకూ ఒమిక్రాన్ కేసులపై స్పష్టత రాదన్నారు.
కోవిడ్ నిబంధనలను...
ఒమిక్రాన్ డెల్టా వేరియంట్ కన్నా వేగంగా వ్యాపిస్తుంది కానీ.. అది సోకిన వారిలో తీవ్ర ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయని, ప్రజలంతా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. కానీ భవిష్యత్ లో లాక్ డౌన్ పెట్టబోమని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మరొక బూస్టర్ డోస్, చిన్నపిల్లలకు కూడా వ్యాక్సినేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు.


Tags:    

Similar News