Telangana: అందుకే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యం: తమ్మినేని

పొత్తుపై కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడంతో చివరకు ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది సీపీఎం. కాంగ్రెస్ తో పొత్తుపై..

Update: 2023-11-05 15:55 GMT

Telangana Election 2023: పొత్తుపై కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడంతో చివరకు ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది సీపీఎం. కాంగ్రెస్ తో పొత్తుపై సీరియస్ గా స్పందించారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. తాము గొంతెమ్మ కోర్కెలు కోరలేదని.. కాంగ్రెస్ తమకు ఇస్తామన్న సీట్లు ఇవ్వకపోవడంతో చాలా రోజులు ఎదురుచూసి ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తమ్మినేని చెప్పుకొచ్చారు. 17 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆ పార్టీ 14 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.

మరో మూడు స్థానాలను పెండింగ్ లో పెట్టింది. తమ బలాన్ని పక్కన బెట్టి ఇతరులకు మద్దతు ఇవ్వబోమన్నారు. ఎవరికి నష్టం చేకూర్చడానికో.. లాభం చేకూర్చడానికో తాము పోటీ చేయడం లేదని, తాము గెలవడానికే పోటీ చేస్తున్నామన్నారు తమ్మినేని. సీపీఐ పోటీ చేసే స్థానాల్లో ఆ పార్టీకి మద్దతునిస్తామని చెప్పారు.

సీపీఎంకు అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఇవ్వాలి, వామపక్ష పార్టీలను బలపర్చాలి, బీజేపీ దుర్మార్గ పాలనకు స్వస్తి పలకాలి అనే మూడు నినాదాలతో ఈ ఎన్నికలకు వెళ్తున్నామని తమ్మినేని వీరభద్రం చెప్పారు. మరోవైపు బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీని ఓడించేందుకు బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఉన్న ఏ పార్టీకైనా తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తమ్మినేని అన్నారు. సీపీఎం విడుదల చేసిన 14 మంది అభ్యర్ధుల జాబితాలో ఖమ్మం జిల్లాలో ఏడు స్థానాలు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు స్థానాలు, వరంగల్, రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో ఒక్కో స్థానం ఉన్నాయి.

ఖమ్మం జిల్లా పాలేరు నుంచి తమ్మినేని, మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి బరిలోకి దిగుతున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని ఒకటో రెండో సీట్లు గెలుచుకునే సీపీఎం పార్టీ ఎట్టకేలకు ఈసారి ఒంటరిగానే పోటీకి సిద్ధమైంది.

అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా పార్టీల్లో అలకలు, అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. టికెట్ల కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన వారు చివరికి సీట్లు దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురై ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇలా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి. రాజకీయ పార్టీల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఎన్నికల దగ్గర పడుతున్నకొద్ది నేతల మాటలు తూటాలు అవుతున్నాయి. పార్టీలు మారడం, ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం ఇలా రోజుకో విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News