Telangana : సీబీఐ విచారణ చేపడుతుందా? కాంగ్రెస్ ఎత్తుగడలో భాగమేనా?
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణకు సీబీఐకి అప్పగించింది.
తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒక విషయంలో రాజకీయ చతరతను చాటింది. వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేసింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించడం రెండు పార్టీలను ఇరకాటంలోకి నెట్టడమేనంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమకు ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలను ఇబ్బందుల్లోకి నెట్టేందుకు మాత్రమే సీబీఐకి కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను అప్పగించారన్నది వాస్తవం. కాళేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అక్రమాలపై మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగించాలని శాసనసభ నిర్ణయించినా ముందుగా ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు కూడా సీబీఐకి అప్పగించాలని డిసైడ్ అయి శాసనసభలో చర్చ పెట్టి తీర్మానం చేశారు.
ప్రత్యర్థి పార్టీలను...
ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థి బీఆర్ఎస్. దానిని నేరుగా రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలచేత విచారణ చేయించి చర్యలు తీసుకుంటే, ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కేసీఆర్ ను అరెస్ట్ చేయడానికి సిద్ధమయితే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా నష్టం జరుగుతుంది. బీఆర్ఎస్ కు సానుభూతి పెరుగుతుంది. లక్షా నలభై ఏడు వేల కోట్ల రూపాయలు వ్యయం చేసి నిర్మించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించినా చుక్క నీరు అందకపోగా, మేడిగడ్డ కూలిపోయిందన్న రాజకీయ విమర్శల వరకూ కాంగ్రెస్ చేయవచ్చు. అదే చర్యలకు దిగితే అది కారు పార్టీకి సానుభూతిగా మారి తమకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయి.
సీబీఐ విచారణ అంటే...
అదేసమయంలో బీజేపీ కోర్టులోకి బంతి నెట్టాలని కూడా కాంగ్రెస్ చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. సీబీఐ విచారణ అంటే అది కేంద్ర ప్రభుత్వం అధినంలో ఉంటుంది. సీబీఐ అంటే కేంద్రం చెప్పినట్లే నడుస్తుందని, దాని జేబు సంస్థ అని కూడా చాలా మంది నమ్ముతారు. అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణను కేంద్రం కోర్టులోకి నెట్టేశారు. సీబీఐ విచారణ అంటే సుదీర్ఘకాలం సాగుతుంది. ఈ విషయం అనేక కేసుల్లో వెల్లడియింది. ఈ కేసులో సీబీఐ విచారణలో ఆలస్యం జరిగితే అది బీజేపీ పై కూడా విమర్శలు చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకోసమే తన చేతికి మట్టి అంటకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణను సీబీఐకి అప్పగించారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే కాంగ్రెస్ చేసే విమర్శలను, సీబీఐ విచారణను జనం నమ్ముతారా? లేదా? అన్నది పక్కన పెడితే హస్తం పార్టీకి జరిగే రాజకీయ నష్టం మాత్రం తక్కువగా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరొకవైపు బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు కూడా రేవంత్ రెడ్డి ఈ నిర్ణయంతో చెక్ పెట్టినట్లయింది.
సీబీఐ కేసులు వేలల్లో పెండింగ్...
మరొకవైపు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పరిధిలో ఉన్న 7,072 అవినీతి కేసుల విచారణ పలు కోర్టుల్లో పెండింగ్ లో ఉందని కేంద్ర నిఘా కమిషన్ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. దీనిలో 379 కేసులు ఇరవై ఏళ్లకు పైగా పెండింగ్ లో ఉండటం గమనార్హం. విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం.. గతేడాది డిసెంబరు 31 నాటికి 1,506 కేసులు మూడేళ్లలోపు పెండింగ్ లో ఉన్నాయని పేర్కొంది. ఇది ఎంతగానో ఆందోళన కలిగించే విషయమని కేంద్ర నిఘా కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించడంతో ఈ కేసు కూడా ఏళ్లు పట్టే అవకాశముందని అర్ధమవుతుంది. దీంతో కాళేశ్వరం కేసులో మళ్లీ ఎన్నికల వరకూ ఏమీ తేలే అవకాశం మాత్రం లేదనే చెప్పాలి.