రేపు చివరి ప్రయత్నంగా ఢిల్లీకి
వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని మోదీ చర్చించేందుకు రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.
వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రధాని మోదీ చర్చించేందుకు రేపు ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదన్నారు. సరైన సమాధానం లేదన్నారు. కేంద్రం నుంచి ఉలుకు, పలుకు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిన వరి ధాన్యాన్ని కొనకపోతే ఏం చేయాలని కేసీఆర్ ప్రశ్నించారు. రైతు ఉద్యమానికి తలవంచి మూడు చట్టాలను రద్దు చేయడం మంచి పరిణామమన్నారు. రైతులపై నమోదు చేసిన కేసులను కూడా వెనక్కు తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
రైతులకు అండగా...
ఢిల్లీలో రైతులు అద్భుతమైన విజయం సాధించామని చెప్పారు. మరణించిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని, ఒక్కొక్క రైతు కుటుంబానికి ఇరవై ఐదు లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని, కనీస మద్దతు ధరకు చట్టం తేవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. కొత్తగా వ్యవసాయ రంగంలో తెచ్చిన విద్యుత్తు చట్టాలను కూడా వెనక్కు తీసుకోవలని కేసీఆర్ డిమాండ్ చేశారు. క్షమాపణలు చెప్పి చేతులు దులుపుకోవడం కాదన్నారు. దిగిరాకుంటే అడుగడుగునా నిలదీస్తామని కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నీటి వాటాల పంపిణీ....
రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీని వెంటనే తేల్చాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఏడేళ్లు ఓపిక పట్టామని ఇక సహనం కోల్పోయామని అన్నారు. గోదావరి నీటిలో తమ వాటా ఎంతో తేల్చాలని ఆయన కోరారు. గోదావరి నీటి పంపిణీ పై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్నారు. నిర్ణీత సమయంలో నీటి పంపకాలు చేపట్టాలని కేసీఆర్ కోరారు. లేకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణపై తాము అసెంబ్లీ ద్వారా పంపిన తీర్మానంపై కూడా నిర్ణయం చేయాలని కోరారు. యాసంగి పంటలో ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ఏ పంటలు వేయాలో సూచిస్తామని చెప్పారు.