Telangana : రేవంత్ రెడ్డి తేల్చేశారా? ఇక కేసీఆర్ బిందాస్ గా ఉండొచ్చా?
ఎన్నికలలో సెంటిమెంట్ కు అవకాశం ఇవ్వకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుంది.
ఎన్నికలలో సెంటిమెంట్ కు అవకాశం ఇవ్వకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుంది. అందుకే కేసీఆర్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనవసరమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు నిజమేనని, అందుకు కేసీఆర్ కారణమని జస్టిస్ పినాకీచంద్రఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై త్వరలో అసెంబ్లీలో చర్చ జరగనుంది. అయితే చర్చ తర్వాత క్రిమినల్ చర్యలకు దిగుతారని అందరూ భావిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అందుకు సిద్ధంగా లేరని కనపడుతుంది. కేసీఆర్ పై తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ప్రజల్లోకి బలంగా వెళ్లడం వల్ల పార్టీకి భవిష్యత్ లో నష్టమని ఆయన భావిస్తున్నారు.
సానుభూతి వస్తుందని...
చట్టప్రకారమే చర్యలు తీసుకున్నప్పటికీ కేసీఆర్ కు ఉన్న క్రేజ్, వయసు వంటి వాటితో ఆయనను కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అరెస్ట్ చేస్తే పుష్కలంగా సానుభూతి లభిస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ స్థాయిలో కూడా ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డికి స్పష్టం చేసినట్లు సమాచారం. కేసీఆర్ ను అరెస్ట్ చేయడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని భావించి ఆ ఆలోచన విరమించుకున్నారని తెలిసింది. అందుకే తాజాగా ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దంపడుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయి కేసీఆర్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారని, ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో శిక్ష అనుభవిస్తున్నారని చెప్పడం వెనక కేసీఆర్ అరెస్ట్ ఉండదని తేల్చేసినట్లయింది.
మిగిలిన వారి కోసం...
అయితే ఇదే సమయంలో కేసీఆర్ ను అరెస్ట్ చేయకపోయినా ఆయన కుమారుడు కేటీఆర్ ను ఫోన్ ట్యాపింగ్, లేదా ఫార్ములా ఈ రేసు కేసులో అరెస్ట్ చేసే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే మాజీ మంత్రి హరీశ్ రావును కూడా అరెస్ట్ చేయవచ్చని అంటున్నారు. కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్న నేతలపైనే రేవంత్ లక్ష్యంగా చేసుకున్నట్లు కనపడుతుంది. అంతే తప్ప కేసీఆర్ కాదని స్పష్టమయిందని రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ లో కుటుంబ వివాదాలు ఊపందుకున్న సమయంలో తాను అరెస్ట్ చేసి వారిని కలపడంతో పాటు అవి మరుగున పడిపోయే ఛాన్స్ ఇవ్వకపోవడం మంచిదన్న అభిప్రాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలిసింది. మరి చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.