Telangan : రేవంత్ రెడ్డిది విశ్వాసమా? అతి విశ్వాసమా? ఆయన నమ్మకమిదేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు కనపడుతుంది

Update: 2025-04-30 11:56 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు కనపడుతుంది. మరోసారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నారు. ప్రజలు పదేళ్ల పాటు ఒక ప్రభుత్వానికి అప్పగించారనే ఆయన భావిస్తున్నారా? 1994 నుంచి నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2014 తర్వాత విభజన తెలంగాణలోనూ రెండుసార్లు ఒకే ప్రభుత్వానికి అధికారాన్ని అప్పచెప్పడమే ఆయన నమ్మకానికి కారణంగా తెలుస్తుంది. 1994, 1999 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అలాగే 2004, 2009 లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ రెండు సార్లు అధికారాన్ని ప్రజలు కట్టబెట్టారు. 2004, 2018 లో బీఆర్ఎస్ కు రెండు సార్లు అధికారం ఇచ్చారు.

పదేళ్ల తర్వాతనే...?
అంటే పదేళ్లు వేచి చూసిన తర్వాతనే ఇతరులకు అధికారాన్ని పంచిపెట్టడం తెలంగాణ ప్రజలకు అలవాటు అని అదే అలవాటును సంప్రదాయాన్ని ఈసారి కూడా ప్రజలు కొనసాగిస్తారన్న నమ్మకంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లుంది. అందుకే మళ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, పదేళ్ల పాటు కాంగ్రెస్ ను అధికారం నుంచి ఎవరూ దించలేరని ఆయన విశ్వాసంతో కనిపిస్తున్నారు. దీంతో పాటు రేవంత్ రెడ్డి మరొక విషయంలోనూ స్పష్టతతో ఉన్నారు. అవనసర అరెస్ట్ లు చేసి సానుభూతిని అవతల వారికి తెచ్చి పెట్టే ఛాన్స్ ఇవ్వకూడదన్న నిర్ణయం కూడా తీసుకున్నట్లుంది. అందుకే ఇటీవల ఆయన మీడియా చిట్ చాట్ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా తాము కక్ష సాధింపు చర్యలకు దిగబోమని తెలిపారు.
అనేక కేసులున్నా...
ఇప్పటికే కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసు కేసు తో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయన్న దానిపై కమిషన్ విచారణ జరుపుతుంది. కానీ ఈ కేసుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో తాము తొందరపడి కేసులు పెట్టబోమని, దర్యాప్తు సంస్థల్లో అక్రమాలు తేలితే చట్టపరంగా అవే చర్యలు తీసుకుంటాయని అనడం కూడా అదే కారణమని అర్థమవుతుంది. ఏ మాత్రం అరెస్ట్ లు జరిగినా అది ప్రత్యర్థికి ప్లస్ గానే మారుతుంది తప్పించి కాంగ్రెస్ కు ప్రయోజనం ఏమీ ఉండకపోవచ్చన్న అంచనా వేసి ఒక్కొక్క కేసు అటక మీదకు ఎక్కించినట్లే కనపడుతుంది. అందుకే రేవంత్ రెడ్డి ఈ టర్మ్ లో మాత్రం అరెస్ట్ అనేది లేకుండానే పాలన ముగించేట్లు కనపడుతుంది.
వచ్చే నెల మొదటి వారం నుంచి...
ఇక తాము చేసేది సరిగా చెప్పుకోలేక పోతున్నామని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువ స్థాయిలో పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అందచేస్తున్నామని, పారదర్శకంగా పాలన అందిస్తున్నామని, ప్రతిపక్షాల గొంతుతో పాటు ఉద్యమ సంఘాల గొంతును కూడా వింటున్నామని, అలాంటి తమది కాదనుకుని, తిరిగి కేసీఆర్ ను ఎందుకు ప్రజలు తలకెత్తుకుంటారన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అందుకే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇక వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, తానే వచ్చే నెల మొదటి వారం నుంచి జనంలోకి వెళ్లాలని కూడా నిర్ణయించుకున్నారు. మరి రేవంత్ రెడ్డిది విశ్వాసమా? అతి విశ్వాసమా? అన్నది భవిష్యత్ లో తేలనుంది.
Tags:    

Similar News