Telangana : మంత్రివర్గం కీలక నిర్ణయం.. వచ్చే నెలలో ఢిల్లీకి
తెలంగాణ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని నిర్ణయించింది
తెలంగాణ మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలోనే తేల్చుకోవాలని నిర్ణయించింది. వచ్చే నెల 5,6,7 తేదీల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అప్పటికీ సానుకూల స్పందన రాకుంటే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండి కూటమి నేతలను కలుపుకుని ఆందోళన చేపట్టాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వర్గం సమావేశం అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ తెలిపారు.
బీసీ బిల్లుల ఆమోదానికి...
తాము ఇక్కడ ఆమోదించిన బిల్లులకు బీజేపీ నేతలే అడ్డుకుంటున్నారని తెలిపారు. మూడు రోజుల పాటు ఢిల్లీ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరం కలసి వెళతామని చెప్పారు. తమ పోరాటానికి అందరూ సహకరించాలని కూడా వారు కోరారు. దీంతో పాటు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం పదిహేను చెక్ పోస్టులుండగా జాతీయ రహదారిపై రవాణాకు ఇబ్బందులు లేకుండా వాటిని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. సీసీ కెమెరాలు, వాహన్ ద్వారా పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అన్ని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీస్ ను ఏర్పాటు చేయాలని మంత్రి వర్గం సమావేశంలో అభిప్రాయపడింది.