Telangana : తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయాలివే
మేడారంలో జరిగిన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలను తీసుకుంది
మేడారంలో జరిగిన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. 2027లో జులై 23వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకూ గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచి ప్రణాళికలను రూపొందించాలని రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. బాసర నుంచి భద్రాచలం వరకూ రాష్ట్రంలోని గోదావరి నదీతీరం వెట ప్రధాన ఆలయాలన్నింటినీ కలుపుతూ ఎకో టూరిజంను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు పురాతన ఆలయాలను కూడా అభివృద్ధి చేయాలని ప్లాన్ తయారు చేయాలని అధికారులను మంత్రివర్గ సమావేశం ఆదేశించింది.
గోదావరి పుష్కరాలను...
గోదావరి పుష్కరాలను పకడ్బందీగా, భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్నానమాచరించి ఆలయాలను సందర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లను చేయాలని, ఇందుకోసం ముందు నుంచి ప్రణాళికలను రూపొందించాలని మంత్రి వర్గ సమావేశం అభిప్రాయపడింది. గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా మంత్రి వర్గ ఉప సంఘాన్ని నియమించాలని నిర్ణయించింది. బాసర నుంచి భద్రాచలం వరకూ టెంపుల్ సర్క్యూట్ ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. ఇందుకోసం దేవాదాయ శాఖ, పర్యాటక శాఖలు సంయుక్తంగా పనిచేయాలని కోరింది. దీంతో పాటు మున్సిపల్ ఎన్నికలను వీలయినంత త్వరగా నిర్వహించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
మున్సిపల్ ఎన్నికలను...
అలాగే వచ్చే నెలలో జరగనున్న రంజాన్, శివరాత్రి పండగలు ఉన్నందున మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 1 ప్రాజెక్టును ఎల్ అండ్ టి సంస్థ నుంచి తీసుకునేందుకు అవసరమైన చర్యలను తీసుకోవాలని నిర్ణయించింది. అలాగే హైదరబాద్ లోని ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్పా లే అవుట్ రోడ్డు వరకూ కొత్త హై లెవెల్ వంతెన నిర్మించాలని నిర్ణయించింది. మొత్తం 9 కిలోమీటర్ల మేరకు ఈ హై లెవల్ వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించింది. దీంతో పాటు పలు కీలక అంశాలపై కూడా మంత్రి వర్గ సమావేశం చర్చించింది.