Telangana : నేటి నుంచి తిరిగి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నీటి యుద్ధమే
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా నీటిపారుదల అంశంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టులకు ఎంత నిధులు కేటాయించింది? ఏ మేరకు పనులు పూర్తి చేసిందీ సభ ద్వారా ప్రజలకు వివరించనుంది. ముఖ్యంగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను సభ ద్వారా తిప్పికొట్టాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా ఉంది. జనవరి రెండు నుంచి జరిగే అసెంబ్లీ సెషన్‌లో కృష్ణా గోదావరి జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై చర్చకు సిద్ధమవుతోంది.
నేడు కృష్ణా నదిపై...
ఈ మేరకు అసెంబ్లీ ఎజెండాను కూడా ఫిక్స్ చేసింది. జనవరి 2న కృష్ణా, 3న గోదావరి బేసిన్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకు కూడా అవకాశం ఇవాలని ప్రతిపక్షం బీఆర్ఎస్ కోరుతోంది. కీలక అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగనున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ సభకు వస్తారా రారా అన్నదే ఆసక్తికరంగా మారింది.అయితే జనవరి రెండు నుంచి జరిగే అసెంబ్లీ సెషన్‌కు అటెండ్ కావాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కృష్ణా-గోదావరి జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై చర్చలో పాల్గొని నిజానిజాలు చెప్పాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తుంది.
బీఆర్ఎస్ నేతలు కూడా...
కేసీఆర్ సభకు వచ్చినా రాకపోయినా.. దానితో సంబంధం లేకుండా అన్ని ప్రాజెక్టులపై చర్చించాలని కాంగ్రెస్ సిద్ధమవుతుంది. గత పదేళ్లలో నీటి పారుదల ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసిన వ్యయం నేడు ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంగా మారింది? వాస్తవానికి ఎన్ని ఎకరాల నీరు సాగయింది? అన్న విషయాలను సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణాంకాలతో సహా వివరించే అవకాశాలున్నాయి. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు,మంత్రులకు నీటి పారుదల ప్రాజెక్టు లపైఅవగాహన కల్పించేందుకు ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు. నేటి సభలో అధికార, విపక్షాల మధ్య నీటి యుద్ధం జరిగే అవకాశముందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.