తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు లేవు.. ఆందోళన వద్దు
తెలంగాణలో ఇప్పటివరకూ ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు.
తెలంగాణలో ఇప్పటివరకూ ఒమిక్రాన్ కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో మంత్రి హరీష్ రావు సిటీ స్కాన్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంగళవారం ఉస్మానియాలో క్యాథ్ ల్యాబ్ సేవలను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే నీలోఫర్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
థర్డ్ వేవ్ పై....?
ఒమిక్రాన్ గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇంతవరకూ ఆ కేసులు లేకపోవడం అదృష్టమన్నారు. థర్డ్ వేవ్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో.. దానిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఒమిక్రాన్ పట్ల జరిగే అసత్య ప్రచారాలను నమ్మి.. ఆందోళన చెందవద్దన్నారు. అలాగే థర్డ్ వేవ్ దృష్ట్యా ఆస్పత్రుల్లోని పడకలు, ఐసీయూ పడకలు, మందులు అంశం, తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై మంగళవారం సమావేశం ఏర్పాటు చేసి.. సంబంధిత అధికారులతో మాట్లాడుతామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డయాగ్నోస్టిక్స్ సేవలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి హరీష్ రావు చెప్పారు.