సమ్మక్క–సారలమ్మ జాతర: మేడారానికి వెళ్లలేనివారికి బంగారం ప్రసాదం హోం డెలివరీ
TGSRTC Logistics offers Bangaram prasadam home delivery for Sammakka Saralamma Jatara. Online booking available at ₹299 for devotees.
హైదరాబాద్: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా గుర్తింపు పొందిన సమ్మక్క–సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న నేపథ్యంలో, మేడారానికి వెళ్లలేని భక్తుల కోసం బంగారం ప్రసాదాన్ని ఇంటి వద్దకే చేర్చే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రకటించింది.
రూ.299కి ఆన్‌లైన్ బుకింగ్
రెండేళ్లకోసారి నిర్వహించే ఈ జాతర ములుగు జిల్లా మేడారంలో జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు గిరిజన దేవతలు సమ్మక్క, సారలమ్మను దర్శించి సంప్రదాయంగా బెల్లాన్ని ప్రసాదంగా సమర్పిస్తారు.
మేడారానికి వెళ్లలేని వారికి ఇంటి వద్దకే ప్రసాదం
వ్యక్తిగత కారణాలు లేదా ప్రయాణ ఇబ్బందుల వల్ల మేడారానికి వెళ్లలేని భక్తుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ హోం డెలివరీ సేవలు ప్రారంభించింది. దేవాదాయ శాఖ సహకారంతో అందించే ప్రతి ప్రసాద ప్యాకెట్‌లో బెల్లం, పసుపు, కుంకుమతో పాటు దేవతల ఫోటో ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్క ప్యాకెట్ ధరను రూ.299గా నిర్ణయించారు.
భక్తులు www.tgsrtclogistics.co.in
వెబ్‌సైట్ ద్వారా లేదా టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల వద్ద ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 040-69440069, 040-23450033 నంబర్లలో టీజీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సంస్థ తెలిపింది.