Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ లది ఫెవికాల్ బంధం
బీజేపీ, బీఆర్ఎస్ లు రెండూ ఒక్కటేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
బీజేపీ, బీఆర్ఎస్ లు రెండూ ఒక్కటేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరం లో జరిగిన అవినీతిపై సీబీఐకి అప్పగించాలని కోరితే తాను ఇచ్చి ఆరు నెలలవుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమకు అధికారం వస్తే కేసీఆర్ ను జైల్లో పెడతామని నాడు కిషన్ రెడ్డి చెప్పిన మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గల్లీలో మోరీలు తీయాలంటే తాము మోదీని వెళ్లి అడగాలా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరంలో లక్ష కోట్లు మింగిన వారిని కూడా వదిలపెడుతున్నారంటే ఇద్దరూ మిలాఖత్ కాక మరేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
కిషన్ రెడ్డి కేసీఆర్ ఎందుకు కాపాడుతున్నారు?
తనకు కులాలు, మతాలకు సంబంధం లేదని అన్నారు. కిషన్ రెడ్డి కేసీఆర్ ను ఎందుకు కాపాడుతున్నారో అందరికీ తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ దత్తపుత్రుడు కల్వకుంట్ల కిషన్ రావు అని విమర్శించారు. కాలనీలు, బస్తీలు అభివృద్ధి జరగాలంటే కార్పొరేటర్ మనోడు ఉండాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు కూడా అనుమతించడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీకి తెలంగాణ ప్రజలకు ఓటు హక్కు అడిగే హక్కు లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని రేవంత్ రెడ్డి అన్నారు.
నిజామాబాద్ కు ఎయిర పోర్టు...
కాంగ్రెస్ ఇంకా ఎనిమిదేళ్లు అధికారంలో ఉంటుందని, ఖచ్చితంగా నిజామాబాద్ అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. నిజామాబాద్ కు ఎయిర్ పోర్టును కూడా తెస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది మందికి రేషన్ కార్డులిచ్చి, మూడు కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్లకు రెండు వందల యూనిట్ల వరకూ యాభై లక్షల మందికి ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. కేసీఆర్ జైలులో చిప్పకూడు తినకుండా ఎవరు అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి నిలదీశారు. వెయ్యి బస్సులను మహిళలను యజమానులు చేశామని తెలిపారు.