Telangana : రేవంత్ ను తప్పిస్తారా? జరుగుతున్న ప్రచారంలో నిజమెంత?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహంగా ఉందన్న ప్రచారం ఊపందుకుంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహంగా ఉందన్న ప్రచారం ఊపందుకుంది. కొన్ని మీడియాలు ఇటువంటి కథనాలు ప్రచురిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఆ ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నాయి. రేవంత్ రెడ్డి అంటే గిట్టని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని బాహాటంగానే చెబుతున్నారు. మల్లికార్జున ఖర్గే తనను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ నేతలతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఇటువంటి వ్యాఖ్యలు పార్టీ నేతలు ముందు మల్లికార్జున ఖర్గే చే్స్తారా? అన్న అనుమానం లేకపోలేదు. ఎందుకంటే జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉంటూ నేతలతో ముఖ్యమంత్రి పనితీరును తప్పుపట్టే విధంగా మాట్లాడటం అసాధ్యమన్నది రేవంత్ రెడ్డి వర్గీయుల వాదన
నిజంగా అసంతృప్తి ఉంటే...
నిజానికి రేవంత్ రెడ్డిపై పార్టీ హైకమాండ్ కు నిజంగా అసంతృప్తి ఉంటే ఆయనను ఏదో ఒక వంకతో పదవి నుంచి తప్పించే వారు. అంతే తప్ప కాంగ్రెస్ నేతలతో ఆయన పనితీరును తప్పుపట్టే పనిని ఏ పార్టీ నాయకత్వం చేయదన్నది వాస్తవం. నిజానికి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చినప్పుడు కూడా రెండు సార్లు అధికారంలోకి రాలేదు. 2014 లో కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేకపోయింది. నిజంగా ప్రజలకు కేసీఆర్ పై గురి కుదిరి ఉంటే 2014 ఎన్నికల్లో విజయంతో సరిపెట్టేవారు. రెండోసారి కూడా ఆయనకే పట్టం కట్టారంటే కాంగ్రెస్ నేతల పట్ల సరైన నమ్మకం లేకపోవడమే. అంతేకాకుండా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రజలను కూడా ఆ రెండు ఎన్నికల్లో ఆకట్టులేకపోయిందని రేవంత్ వర్గీయులు అంటున్నారు.
రేవంత్ తన ప్రసంగంతో...
2023 ఎన్నికలకు ముందు పీసీసీ చీఫ్ పదవి దక్కించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి జనంలోకి వెళ్లడమే కాకుండా పార్టీని గెలుపు దిశగా తీసుకు వచ్చారంటున్నారు. కేసీఆర్ మాటలకు ధీటుగా రేవంత్ రెడ్డి ప్రసంగం కూడా ప్రజలను ఆకట్టుకోవడం గత ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఒక కారణమన్న విశ్లేషణలు కూడా ఉన్నాయి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా బాగా పనిచేయడం వల్లనే కాంగ్రెస్ గెలుపు సాధ్యమయింది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ని తప్పించి మరొకరిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టే సాహసం కాంగ్రెస్ హైకమాండ్ చేసే అవకాశం లేదు. నిధులు లేకపోయినా ఇచ్చిన హామీలను అమలు చేశారని, ముఖ్యమంత్రిపై పార్టీలో వ్యతిరేకత లేదన్నది వారుచెబుతున్న మాట. మొత్తం మీద తప్పుడు ప్రచారం చేయవద్దంటూ రేవంత్ రెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో వార్నింగ్ ఇస్తున్నారు.