SLBC Accident : సహాయక చర్యల్లో వేగం.. మరికొద్ది రోజుల్లోనే ముగింపు?

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనాసాగుతున్నాయి

Update: 2025-04-11 03:58 GMT

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనాసాగుతున్నాయి. అయితే కొంత వరకూ పురోగతి లభించింది. ఈరోజుకు సహాయక చర్యలు నలభై ఆరో రోజుకు చేరాయి. టీబీఎం మిషన్ శకలాలను తొలగించే ప్రక్రియ వేగం పుంజుకుంది. కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో ఏర్పాటు కావడంతో దానిపై నుంచి టీబీఎం మిషన్ శకలాలతో పాటు పేరుకుపోయిన బురదను, మట్టిని కూడా తొలగిస్తున్నారు. రోబోలను పక్కన పెట్టి మాన్యువల్ గా ఈ పనులు వేగంగా చేస్తున్నారు.

ఆరు మృతదేహాల కోసం...
మిగిలిన ఆరు మృతదేహాలను కానీ, వాటి అవశేషాలను కూడా మృతుల బంధువులకు అప్పగిస్తే ఆపరేషన్ టన్నెల్ ముగిసినట్లే. ఇందుకోసం సహాయక బృందాలతో పాటు జిల్లా యంత్రాంగం కూడా శ్రమిస్తుంది. నెలన్నర గడుస్తున్న ఆపరేషన్ ముగియకపోవడంతో సహాయక బృందాల్లో కొంత నిరాశ కనిపిస్తున్నప్పటికీ ఎండ్ కార్డు పడే వరకూ కొనసాగించాలన్న పట్టుదల ప్రతి వారిలోనూ కనిపిస్తుంది. అందుకే షిఫ్ట్ ల వారీగా దాదాపు 650 మంది సహాయక బృందాల్లోని సభ్యులు నిరంతరంగా పనిచేస్తున్నారు.
శ్రమకు తగిన ఫలితం...
వారి శ్రమకు తగిన ఫలితం త్వరలోనే కనిపిస్తుందన్నఆశాభావం వారిలో వ్యక్తమవుతుంది. మిషన్ల కన్నా మాన్యువల్ ద్వారానే ఆపరేషన్ కు త్వరగా ముగింపు పలకవచ్చన్న అంచనాకు అధికారులు కూడా వచ్చారు. ప్రమాదం జరిగే ప్రాంతం కావడంతో కొంత మేర జాగ్రత్తలు తీసుకుని సహాయక చర్యలు కొనసాగిస్తే మిగిలిన ఆరు మృతదేహాలు లభ్యమయ్యే అవకాశముందన్న అంచనాలు వినపడుతున్నాయి. తాజాగా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలోనూ ఇదే వెల్లడించారని తెలిసింది. టీబీఎం మిషన్ శకలాలు, బురద తొలగింపు ప్రక్రియ పూర్తయితే ఇక తవ్వకాలు చేపట్టనున్నారు.



Tags:    

Similar News