తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టనున్న వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కుర

Update: 2023-07-03 02:57 GMT

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు. సోమవారం నాడు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వానలు పడనుండగా.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. జులై 4వ తేదీ ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక 5వ తేదీ ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వానలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. జులై 6,7వ తేదీల్లో కూడా వర్షాలు పడనున్నట్లు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు తెలంగాణ వ్యాప్తంగా విస్తరించగా.. ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి.

ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. అక్కడక్కడా పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో రానున్న మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. సోమవారం మన్యం, అల్లూరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అన్నారు. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ కురిసే అవకాశం ఉందన్నారు. బుధవారం పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News