26న హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఏమిటంటే..!

ప్రధానమంత్రి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగి, గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు వెళ్తారు. అక్కడ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.

Update: 2022-05-19 07:09 GMT

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలందరూ తెలంగాణ బాట పడుతున్నారు. జెపి నడ్డా, అమిత్ షా తెలంగాణ పర్యటన తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ కూడా హైదరాబాద్‌కు రానున్నారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ నెల 26న తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ కు రానున్నారు. న‌గ‌రంలోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వార్షికోత్స‌వంలో ఆయ‌న పాలుపంచుకోనున్నారు. రామ‌గుండంలో ఏర్పాటు చేసిన ఎరువుల క‌ర్మాగారాన్ని కూడా ఆయ‌న హైద‌రాబాద్ నుంచే వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించే అవ‌కాశాలున్నాయి.

పార్టీ ప‌రంగా కూడా మోదీ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. బీజేపీ తెలంగాణ శాఖ‌కు చెందిన కీల‌క నేత‌ల‌తో మోదీ ప్ర‌త్యేకంగా భేటీ అవుతారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే మోదీకి ఘ‌న స్వాగ‌తం ప‌లికే దిశగా బీజేపీ తెలంగాణ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఐఎస్‌బీ వార్షిక దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లే ముందు ప్రధాని మోదీ విమానాశ్రయంలో బీజేపీ నేతలతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌ను ప్రధాని మోదీ విమానాశ్రయం నుంచే జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన వర్చువల్‌గా హాజరవుతారు.
''గత 20 రోజుల్లో ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తెలంగాణకు వచ్చారు, ఇప్పుడు ప్రధాని కూడా వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని మరింతగా పెంపొందిస్తుంది'' అని బీజేపీ నేత ఒకరు తెలిపారు. విమానాశ్రయంలో గ్రాండ్ వెల్కమ్ ఇవ్వడమే కాకుండా దాదాపు 26,000 మంది బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధాని మాట్లాడే కార్యక్రమాన్ని నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర విభాగం యోచిస్తోంది. ప్రధానమంత్రి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగి, గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు వెళ్తారు. అక్కడ 20వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, "విమానాశ్రయంలో ప్రధానమంత్రి పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యేలా ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదించారు. షెడ్యూల్ ఆమోదం కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి పంపబడింది." అని అన్నారు. హైదరాబాద్‌లో మోదీకి స్వాగతం పలుకుతూ భారీ కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్స్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News