Telangana : గద్వాల్ కు భూతం భయం.. ఆందోళనలో ప్రజానీకం
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలలో గత మూడు రోజులుగా భూతం తిరుగుతోందని వదంతులు వ్యాప్తి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు
ప్రజలు మూఢనమ్మకాలకు తల వంచుతారు. అందులో గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలు మరీ ఎక్కువగా నమ్ముతారు. మూడనమ్మకాలంటే వారు అంగీకరించరు. గ్రామానికి ఏ కీడుజరిగినా అందుకు కారణం కూడా గ్రామస్థులు చెబుతుంటారు. పూజలు నిర్వహిస్తుంటారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలలో గత మూడు రోజులుగా భూతం తిరుగుతోందని వదంతులు వ్యాప్తి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బయటకు వచ్చేందుకు కూడా ప్రజలు భయపడిపోతన్నారు. చిన్నారులను, మహిళలను ఒంటరిగా బయటకు పంపడం లేదు.
రాత్రి వేళ బయటకు రావడానికి...
రాత్రి ఏడు గంటలు దాటితే బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొందరు భూత వైద్యులను కూడా సంప్రదించారు. తమపై భూతం ఎక్కడ పగబడుతుందేమోనని భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు నకిలీ వీడియోలు చేసి వైరల్ చేయడంతో ఈ భయం మరింత ఎక్కువయింది. దీనిపై ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ వారి మాటలను విశ్వసించడం లేదు. కొందరు భూత వైద్యులను సంప్రదిస్తుండటంతో పరిస్థితి మరింత ఎక్కువయింది.
పోలీసులు ఏమంటున్నారంటే?
దీనిపై గద్వాల పోలీసులు మరొక సారి స్పష్టతనిచ్చారు. ప్రజలు ఇటువంటి పుకార్లను నమ్మవద్దని, గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ వీడియో డౌన్‌లోడ్ చేసి వాట్సాప్ గ్రూపుల్లో పంచుతున్నారని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వీడియోను డౌన్‌లోడ్ చేసి, గద్వాలలో భూతం తిరుగుతోందని పేర్కొంటూ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారని, వీడియో గ్రామస్థులలో వ్యాపించడంతో విషయం పోలీసులకు తెలిసింది. దానిని పరిశీలించగా, అది స్థానికంగా రికార్డ్ చేయబడినది కాదని తేలిందని పోలీసులు తెలిపారు. వీడియో వల్ల గ్రామాల్లో ఆందోళన పెరిగిన నేపథ్యంలో, గద్వాల్ పోలీసులు అది నకిలీ వీడియో మాత్రమేనని, నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు.