పొంగులేటికి క్లాస్ పీకిన పీసీసీ చీఫ్
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లాస్ పీకారు
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ క్లాస్ పీకారు. సంబంధం లేని అంశాలతో మాట్లాడవద్దని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరుకు వస్తుందని, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని నిన్న పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలను మీడియా ఎదుట మాట్లాడతారని పీసీసీ చీఫ్ పొంగులేటిని ప్రశ్నించినట్లు తెలిసింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై...
దీంతో పాటు రిజర్వేషన్ల అంశం ముడి పడి ఉందని, న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశంపై మాట్లాడేటప్పుడు మంత్రులు జాగ్రత్తలు పాటించాలని కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నట్లు తెలిసింది. ఒక మంత్రిత్వ శాఖ అంశంపై మరొకరు మాట్లాడటం సరికాదని కూడా అన్నారని చెబుతున్నారు. అయితే తాను మీడియాతో మాట్లాడలేదని, కార్యకర్తలను స్థానికసంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలన్న ఉద్దేశ్యంతోనే ఆ మాటలు మాట్లాడానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలిసింది.