Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు ఎప్పుడంటే?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రారంభ కార్యక్రమం ఈ నెలలోనే చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలలోనే మరొక కీలకమైన పనులకు ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రారంభ కార్యక్రమం ఈ నెలలోనే చేయనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. శ్రావణ మాసం కావడంతో పాటు శుభముహూర్తాలు ఉండటంతో పూర్తయిన ఇళ్లను ప్రారంభించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఎన్ని ఇళ్లు పూర్తియినా సంఖ్యా పరంగా కాకుండా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల పండగను ఈ మాసంలోనే జరపాలని ఇటు అధికారులకు, అటు మంత్రులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.
మూకుమ్మడిగా...
ఇందులో భాగంగా గృహనిర్మాణ శాఖ అధికారులు వేగంగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. కొంచెం వర్షం వల్ల ఆలస్యమవుతున్నప్పటికీ అనుకున్న సమయానికి గృహప్రవేశానికి వీలుగా ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలంటూ ఇప్పటికే హౌసింగ్ శాఖకు చెందిన అధికారులు లబ్దిదారులను కోరుతున్నట్లు తెలిసింది. అవసరమైన బిల్లులను వెంటనే చెల్లిస్తామని, నగదు కోసం వేచి చూడకుండా ఇళ్లకు రంగులు వేసుకోవడం వరకూ పూర్తి చేసి సిద్ధం చేసుకోవాలని లబ్దిదారులను ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి చేతులు మీదుగా కొన్ని ఇందిరమ్మ ఇళ్లలో గృహప్రవేశాల పండగను చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అధికారులు యుద్ద ప్రాతిపదికపై పనులు పూర్తి చేస్తున్నారు.
నాలుగు వేల వరకూ...
శ్రావణమాసం పూర్తి కావస్తుండటంతో మహిళలకు అత్యంత ఇష్టమైన సొంత ఇంటి కలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించేందుకు వీలుగా నిర్మాణాలను పూర్తి చేసి సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చంద్రుగొండ, మండలం బెండలపాడులో రేవంత్ రెడ్డి పూర్తయిన ఇళ్లను ప్రారంభిస్తారని ప్రాధమికంగా అందుతున్న సమాచారం. ఇక మిగిలిన ప్రాంతాల్ల పూర్తయిన వాటిని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ లబ్దిదారుల చేత గృహప్రవేశాలు చేయించి ఆ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు నాలుగువేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉండటంతో ఈ నెల 21వ తేదీన ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈలోపు అన్ని హంగులు పూర్తి చేసి రంగులు అద్ది ఇళ్లను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు చెబుతున్నారు