Telangana : వాహనదారులూ.. పోలీసులు లేరని బిందాస్ గా వెళ్లాలనుకుంటే భారీ జరిమానా చెల్లించాల్సిందే
తెలంగాణలో వాహనదారుల హై అలెర్ట్ గా ఉండాల్సిందే. పోలీసులు లేరని రహదారులపై మీ ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తే జరిమానాలు చెల్లించాలి
తెలంగాణలో వాహనదారుల హై అలెర్ట్ గా ఉండాల్సిందే. పోలీసులు లేరని రహదారులపై మీ ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేస్తే జరిమానాలు చెల్లించాలి. మీకు తెలియకుండానే మీ వెహికల్ నెంబర్ పై జరిమానాలు జమ అవుతుంటాయి. తెలంగాణ వ్యాప్తంగా ఏఐ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీలు చేసి జరిమానా చేసే పాత సిస్టమ్ ఇక ఉండదు. కొత్త సిస్టమ్ లో ఆటోమేటిక్ గా జరిమానా పడిపోతుంది. రహదారి నిబంధనలను అతిక్రమిస్తే ఇక అంతే. వేల రూపాయలు జరిమానాలు చెల్లించాల్సిందే. వాహనాలు ఆపలేదని బిందాస్ గా ఇంటికెళితే లాభం లేదు. ఆన్ లైన్ లో వాహనంపై ఉన్న జరిమానాలు చెల్లించాలని తెలంగాణ రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు.
ప్రమాదాలకు కూడా కారణమవుతూ...
రోడ్డు మీద నిబంధనలు అతిక్రమిస్తూ వెళుతున్న వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అనేకచోట్ల ఈ కారణంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు లేరని భావించి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కూడా ఆగకుండా వెళ్లిపోతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీతో నిబంధనల ఉల్లంఘంచే వాహనాల్ని వెంటనే పట్టుకునేందుకు రవాణాశాఖ సిద్ధం అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే కెమెరాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం మూడుకోట్ల ముప్ఫయి లక్షల ఖర్చుతో ముప్ఫయి ప్రాంతాల్లో అరవై వరకూ ఏఎన్‌పీఆర్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం పరిపాలనపరమైన అనుమతుల్ని జారీ చేస్తూ రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేయడంతో అన్ని రకాల కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
నిబంధనలను ఉల్లంఘించి...
వెహికిల్ టాక్స్ చెల్లించక పోవడం, ఓవర్ లోడింగ్ వంటి నిబంధనలను ఉల్లంఘించే వాహనాల్ని పట్టుకునేందుకు ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. ఏఐ సాయంతో వాహనం నంబర్ ను ఆటోమేటిక్ గా కెమెరాలు గుర్తిస్తాయి. వెహికిల్ డీటైల్స్ అన్ని అధికారులకు పంపిస్తాయి. దీంతో వేగంగా పట్టుకోవడానికి వీలవుతుంది. ఇటీవల కామారెడ్డి చెక్‌పోస్టు వద్ద జూన్ నెలలో ప్రయోగాత్మకంగా కెమెరాలు ఏర్పాటు చేయగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాహనాల సమాచారం క్షణాల్లో తెలిసిపోయిందని అధికారులు తెలిపారు. ఇదే టెక్నాలజీతో పనిచేసే కెమెరాలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలను పాటించని వెహికిల్స్ ను కెమెరా సహాయంతో అడ్డుకుని జరిమానాలు విధిస్తున్నారు. ఇలా చేయడం వలన రోడ్లపై కనిపించే ప్రతి వాహనాన్ని ఆపాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద అధికారులు నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులు పని పట్టేందుకు సిద్ధమవుతున్నారు