Kalvakuntla Kavitha : కవిత ఇంకా ఎన్నిరోజులు తీహార్ జైలులో ఉంటారో?

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ నెల 23వ వరకూ జ్యడిషియల్ కస్టడీ విధించారు.

Update: 2024-04-15 05:28 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. మూడు రోజులపాటు సీబీఐ కస్టడీ ముగియడంతో కవితను న్యాయస్థానంలో హాజరుపర్చగా ఆమెకుకు న్యాయస్థానం ఈ నెల 23వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కవితను పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తో పాటు సీబీఐ కూడా కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

కవిత ప్రమేయంతోనే...
కల్వకుంట్ల కవిత ప్రమేయంతోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జరిగిందని ఈడీ, సీబీఐలు బలంగా ఆరోపిస్తున్నాయి. సౌత్ గ్రూపు నుంచి వంద కోట్ల రూపాయలను సేకరించి ఆమ్ ఆద్మీ పార్టీలకు కవిత చేరవేశారని కూడా చెబుతున్నారు. మరోవైపు ఇదే కేసులో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డిని బెదిరించి మహబూబ్ నగర్ లో ఒక భూమిని ఎనభై కోట్ల రూపాయలకు వత్తిడి తెచ్చి, బెదిరించి కొనుగోలు చేయించారని కూడా ఈడీ, సీబీఐలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కవిత ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలున్నాయని రెండు దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి.
ఈడీ అరెస్ట్ తో...
మార్చి 15వ తేదీన కల్వకుంట్ల కవితను బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో సోదాలు జరిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. తర్వాత ఆమెను పది రోజుల కస్టడీలో ఉంచుకుని విచారించారు. తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి న్యాయస్థానం ఆదేశించడంతో తీహార్ జైలుకు తరలించారు. తర్వాత సీబీఐ కూడా ఆమెను అరెస్ట్ చేయడంతో ఆమెను సీబీఐకి మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. నేటితో కస్టడీ ముగియడంతో తిరిగి ఈ నెల 23వ తేదీ వరకూ ఆమె తీహార్ జైలులోనే ఉండనున్నారు. నేటికి కవిత అరెస్టయి నెల రోజులయింది.
సీబీఐ కస్టడీ కాదంటూ...
కోర్టుకు వచ్చిన కవిత మాట్లాడుతూ ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అంటూ కవిత మీడియా ఎదుట వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు ఈ కేసులో మాట్లాడినట్లే సీబీఐ అధికారులు కూడా తనను ప్రశ్నించారన్నారు. కొత్తగా వేసే ప్రశ్నలేవీ లేవన్నారు. వాళ్ల వద్ద కొత్త సమాచారం కూడా లేనట్లే ఉందని ఎద్దేవా చేశారు. రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతూ కేసును సాగదీస్తున్నారు తప్పించి కేసులో ఏమీ లేదన్నారు. ఇది రాజకీయ కుట్రకోణంలో ఇరికించిన కేసు అని కవిత మరోసారి వ్యాఖ్యానించారు.


Tags:    

Similar News