Konda Surekha : ప్రభుత్వానికి "కొండా" భారంగా మారినట్లున్నారుగా?

మంత్రి కొండా సురేఖ పార్టీకి భారంగా మారారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు

Update: 2025-05-16 12:25 GMT

మంత్రి కొండా సురేఖ అధికార పార్టీకి భారంగా మారారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు. మంత్రివర్గంలో ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు. గతంలోనూ ఒక సినీ హీరో కుటుంబం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ చివరకు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కొండాసురేఖ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో పాటు కాంగ్రెస్ హైకమాండ్ ఎన్ని మార్లు చెప్పినప్పటికీ ఆమె తీరు మారడం లేదు. కేటీఆర్ మీద కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసి ఆమె పరువు నష్టం దావాను ఎదుర్కొన్నారు. ఇలా కొండా సురేఖ తరచూ ప్రభుత్వానికి పంటి కింద రాయిలా మారారు.

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు...
మంత్రి కొండా సురేఖ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైల్స్‌ క్లియరెన్స్‌ చేయడం కోసం కొందరు మంత్రులు డబ్బు తీసుకుంటారని, తాను ఎలాంటి డబ్బు ఆశించలేదని కొండా సురేఖ తెలిపారు. ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ తాను నిజాయితీ పరులానంటూ ఆమె చెప్పుకొచ్చారు. తన లా ఎవరూ ఉండరని కూడా అన్నారు. అంటే మిగిలిన కాంగ్రెస్ మంత్రులు అవినీతి పరులు అంటూ ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు జనంలోకి వెళ్లిపోయాయి. తాను సుద్దపూసను అని చెప్పుకోవడంలో తప్పలేదు. కానీ తాను మిగిలిన మంత్రుల్లాగా ఫైళ్ల క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకోవడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి గురయ్యారు.
నిజాయితీ పరురాలని అని...
తాను నిజాయితీ పరురాలనని చెప్పుకోవడాన్ని ఎవరూ అభ్యంతరం పెట్టరు. కానీ మంత్రివర్గంలో ఉంటూ తాను ఒక్కరే ఫైళ్లు క్లియరెన్స్ కు డబ్బులు తీసుకోలేని అనడం అంటే... మిగిలిన మంత్రులకు కించపర్చినట్లేనని అంటున్నారు. ప్రభుత్వ కాలేజీ నిర్మాణానికి నాలుగున్న కోట్ల రూపాయలు ఖర్చయిందన్న కొండా సురేఖ తాను డబ్బు ఆశించకుండా కాలేజీ కట్టించానని చెప్పారు. ఇప్పుడు పార్టీలో నూ ఇది చర్చనీయాంశమైంది. మంత్రిగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పార్టీ కార్యకర్తలే ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీడియా క్లిప్పింగ్స్ ను తెప్పించుకుని చూసినట్లు సమాచారం.
సర్దుకుని వివరణ ఇచ్చినా...
అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో పాటు హైకమాండ్ నుంచి ఫోన్లు రావడంతో మంత్రి కొండా సురేఖ ఎప్పటిలాగానే వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారంటూ రొటీన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. తాను గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్ కోసం అవినీతికి పాల్పడేవారని అన్నానని, తమ ప్రభుత్వం గురించి మాట్లాడలేదని ఆమె వివరణ ఇచ్చుకున్నారు. కానీ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అప్పటికే పార్టీని, ప్రభుత్వాన్ని బాగాడ్యామేజీ చేశాయి. చివరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సయితం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిజమేనని, మంత్రిగా అంగీకరించినందుకు సంతోషంగా ఉందని ఆయన వ్యాఖ్యానించడం విశేషం.


Tags:    

Similar News