తమిళిసై గవర్నర్‌గా ఉండకూడదు: హరీశ్ రావు

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వానికి మరో షాక్

Update: 2023-09-25 17:57 GMT

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ అభ్యర్థిత్వాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై. ఈ ఇద్దరు అభ్యర్థులు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయటానికి అర్హతలు అడ్డొస్తున్నాయని గవర్నర్ తమిళి సై వివరణ ఇచ్చారు. దీంతో మరోసారి గవర్నర్ తమిళిసై పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు.

తెలంగాణ పట్ల గవర్నర్ తీరు మారలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు. కేబినెట్ సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడం సరికాదన్నారు. వారు బీఆర్ఎస్ సభ్యులుగా ఉన్నారనే కారణంతో తిరస్కరించడం, అనర్హులు కారని చెప్పడం ఏమిటన్నారు. సర్కారియా కమిషన్ ప్రకారం తమిళిసై గవర్నర్ పదవిలో ఉండకూడదన్నారు. పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న వ్యక్తిని గవర్నర్‌గా నియమించవచ్చా? అని ప్రశ్నించారు. తమిళిసై ఎలా తెలంగాణ గవర్నర్‌గా వచ్చారో చెప్పాలన్నారు. బీజేపీ నేత గులాం అలీని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపించలేదా? అని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక న్యాయం, బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో మరొక న్యాయమా? అని ప్రశ్నించారు హరీష్ రావు.


Tags:    

Similar News