Rain Alert : కుండపోత వానలేనట.. కుమ్మేయడం గ్యారంటీ అట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-09-13 03:56 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతం అయిందని చెప్పింది. పశ్చిమ మధ్య, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడిందని, రానున్న 48 గంటల్లో దక్షిణఒడిశా, ఉత్తరాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రెండు రాష్ట్రాల్లో మూడు రోజులు అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని పేర్కొంది.

మూడు రోజుల పాటు...
ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్సు ఉందని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. ద్రోణి ప్రభావంతో శనివారం నాడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని, తీరం వెంట గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దంటూ సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పిడుగులు పడతాయంటూ...
తెలంగాణలోనూ మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈరోజు సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ చెప్పింది.


Tags:    

Similar News