Rain Alert : అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయండి.. భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది

Update: 2025-09-12 03:32 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశముందని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ఇళ్ల నుంచి పని ఉంటే తప్ప బయటకు రావద్దన్న సూచనలు కూడా చేసింది. ముఖ్యంగా ఉదయం వేళ ఎండతీవ్రత ఉన్నప్పటికీ సాయంత్రానికి క్లౌడ్ బరస్ట్ అయినట్లు కుండ పోత వర్షం కురుస్తుందని, కొన్ని ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ముప్పు కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వీలయితే జిల్లా కలెక్టర్ కార్యాయాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించింది.

తెలంగాణలో ఐదు రోజులు...
తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు పడతాయని చెప్పింది. అదే సమయంలో హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగే ఛాన్స్ ఉందని కూడా హెచ్చరించింది. ఈరోజు జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, కామారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాబాద్, సూర్యాపేట, నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ లో మధ్యాహ్నం తర్వాత బయటకు రావద్దని, ఇళ్లలో ఉండాలని కూడా సూచించింది.
ఏపీలో ఇక్కడ...
ఆంధ్రప్రదేశ్ లోనూ ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యాకారులు చేపల వేటకు వెళ్లవద్దని కూడా సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.


Tags:    

Similar News