Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. వర్షాలు.. చలిగాలులు
భారత వాతావరణ శాఖ అధికారులు కీలక అప్ డేట్ ఇచ్చారు.
భారత వాతావరణ శాఖ అధికారులు కీలక అప్ డేట్ ఇచ్చారు. చలి తీవ్రత దేశమంతా కొనసాగుతుందని తెలిపారు. మరికొన్ని రోజులు చలి గాలులు ఎక్కువగా వీస్తాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షణాది వరకూ అన్ని ప్రాంతాల్లో ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రజలు అవసరమైతేనే తప్ప ఉదయం, సాయంత్రం వేళ బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేసింది. అనేక చోట్ల కోల్డ్ వేవ్స్ వణికిస్తున్నాయి. ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని, ప్రజలు అలెర్ట్ గా లేకపోతే ఇబ్బందులు తప్పవని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.
మోస్తరు వర్షం...
ఆంధ్రప్రదేశ్ లోనూ చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. అనేక ప్రాంతాల్లో చలి దెబ్బకు ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే అమరావతి వాతావరణ శాఖ చెప్పిన దాని ప్రకారం ఈరోజు కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. అయితే భారీ వర్షం కురవకపోవచ్చని, మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో చలితీవ్రత మరింత పెరిగే అవకాశముంది. అలాగే పొగమంచు ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. దట్టమైన పొగమంచు అలుము కోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉందని, సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరింతగా పడిపోనున్న...
తెలంగాణలోనూ మరో మూడు రోజుల పాటు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని, సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పొడి వాతావరణం ఉన్నప్పటికీ చలి తీవ్రత మాత్రం మరింత పెరుగుతుందని తెలిపారు. ఆదిలాబాద్, కొమ్రభీం ఆసిఫాబాద్, మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇక్కడ పది డిగ్రీల కంటే తక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.