కడసారి కన్నీటి వీడ్కోలు .. మెడికో ప్రీతి అంత్యక్రియలు పూర్తి

వైద్యురాలిగా వచ్చి.. తమ గ్రామానికి సేవ చేస్తుందనుకున్న ప్రీతిని ఇలాంటి స్థితిలో చూస్తామని కలలో కూడా అనుకోలేదని..

Update: 2023-02-27 09:10 GMT

medico preeti funeral

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ వైద్యవిద్యార్థిని ప్రీతి సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసి, ఐదురోజులుగా మృత్యువుతో పోరాడి ఓడింది. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రీతి భౌతిక కాయానికి సోమవారం మధ్యాహ్నం స్వగ్రామమైన మొండ్రాయి గిర్ని తండాలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రీతి భౌతికకాయం తండాకు చేరుకోగానే.. తండా వాసులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు.

వైద్యురాలిగా వచ్చి.. తమ గ్రామానికి సేవ చేస్తుందనుకున్న ప్రీతిని ఇలాంటి స్థితిలో చూస్తామని కలలో కూడా అనుకోలేదని గుండెలవిసేలా రోధించారు. కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అశ్రునయనాలతో ప్రీతి భౌతిక కాయాన్ని సమాధి చేశారు. ప్రీతి మృతి పట్ల తెలుగు రాష్ట్రాలలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు. ఇదే క్రమంలో నిందితులకు శిక్ష పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రీతి కుటుంబానికి హామీ ఇచ్చారు. ఇంకా ఆమె మరణానికి పరిహారంగా రూ.30 లక్షలు, కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది.
కాగా.. తనకూతురిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ హత్యేనని తండ్రి నరేందర్ ఆరోపించారు. ప్రీతికి మత్తు ఇంజక్షన్ చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని వాపోయారు. అందుకు సంబంధించిన ఆధారాలన్నీ పోలీసులకు సమర్పించామని, ప్రభుత్వం నిందితులు తప్పించుకోకుండా చర్యలు తీసుకుని, కఠినంగా శిక్షించాలని కోరారు.


Tags:    

Similar News