Telangana : మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం నిజంగానే రాజకీయ కుట్రేనా?

Update: 2025-08-17 12:29 GMT

మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం తెలంగాణ వ్యాప్తంగా ఊపందుకుంటోంది. అయితే దీనిని రాజకీయ ఉద్యమంగా కొందరు కొట్టిపారేస్తున్నారు. బీజేపీకి అండగా నిలిచే మార్వాడీలను అణిచివేసేందుకు ఈ ఉద్యమం పుట్టిందని బీజేపీ ఆరోపిస్తుండగా, మరొకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు కూడా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానానికి అండగా నిలుస్తుండటంతో దీనికి రాజకీయ రంగు పులుముకుంది. ఈ ఉద్యమం పురుడు పోసుకోవడానికి ప్రధాన కారణం ఒక మార్వాడీ తన కారును తీయమని అడిగిన తెలంగాణ యువకుడిని చితకబాదడంతోనే తలెత్తిందని చెబుతున్నారు. ఎక్కడి నుంచో ఇక్కడకు బతకడానికి వచ్చిన వారు దాడులకు దిగుతున్నారంటూ తొలుత సోషల్ మీడియాలో మొదలయిన ఉద్యమం తర్వాత వీధుల్లోకి చేరింది.

స్థానికులకు ఉపాధి అవకాశాలు...
మార్వాడీలు ఇక్కడకు వచ్చి వ్యాపారాలు చేయడమే కాకుండా ఇక్కడి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని ప్రధానంగా కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నెల 18వ తేదీన ఆమనగల్లు బంద్ కు తొలుత పిలుపునిచ్చినప్పటికీ దానిని వాయిదా వేసుకున్నారు. మార్వాడీ సంఘాల నేతలతో చర్చలున్నందున బంద్ ను వాయిదా వేయనున్నట్లు ప్రకటించారు. అయితే మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటూ బతకవచ్చని, అదే సమయంలో ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించాలని, వారు కనీసం జీఎస్టీ, రాష్ట్ర పన్నులు కూడ చెల్లించడం లేదని, ఆన్ లైన్ నగదు లావాదేవీలను వారు అనుమతించడం లేదని, దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది.
తమ నుంచి దూరం చేయడానికేనంటూ...
మరొకవైపు బీజేపీ నేతలు దీనిని ఖండిస్తున్నారు. మార్వాడీలను బీజేపీకి దూరం చేయడానికే ఈ రకమైన ఉద్యమాన్ని తెరమీదకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీసుకువచ్చాయని ఆయన ఆరోపించారు. మార్వాడీలు రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. పెట్టుబడులు తెచ్చే వారిని తరిమేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. మరొకవైపు మార్వాడీల వైఖరిని వ్యతిరేకిస్తూ గోరటి రమేష్ పాటపాడటంతో అతని అరెస్ట్ మరింత ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మార్వాడీలు వ్యాపారాలు చేసుకుంటున్నారని, వారికి రాజకీయం అంటగడితే ఎలా అని కమలనాధులు ప్రశ్నిస్తున్నారు. భారత్ లో ఎక్కడైనా జీవించే హక్కు అందరికీ ఉంటుందని వాదిస్తున్నారు.
వారు అలా అంటే...
మార్వాడీ గో బ్యాక్ ఉద్యమాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు వెనకుండి నడిపిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము కూడా రోహింగ్యాలు గో బ్యాక్ నినాదాన్ని అందుకుంటామని, వారిని కూడా తెలంగాణ నుంచి ప్రభుత్వం పంపించి వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేతలు ఎవరూ మార్వాడీ గో బ్యాక్ ఉద్యమంపై స్పందించడం లేదు. అలాగే బీఆర్ఎస్ అగ్ర నేతలు కూడా ఈ ఉద్యమానికి దూరంగా ఉన్నారు. కేవలం ఆ రెండు పార్టీల క్యాడర్ పాల్గొంటే అది స్థానిక అంశాలకు సంబంధించిందని ఆ పార్టీలు వాదిస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణలో మరొక ఉద్యమం ఎన్నికలకు ఇన్నేళ్లకు ముందు రూపుదిద్దుకోవడం రాజకీయంగా ఎవరికి లాభమో తెలియదు కానీ.. క్షేమకరం కాదని పలువురు తెలంగాణ సామాజికవేత్తలు అంటున్నారు.


Tags:    

Similar News