నవీన్ తో నాకు పెళ్లి జరగలేదు..అంతా కల్పితం : కిడ్నాప్ బాధితురాలు వైశాలి

అతడు పెళ్లి జరిగింది అని చెప్పిన రోజున తాను ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, అందుకు ఆధారాలు ..

Update: 2022-12-11 05:35 GMT

రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో బీడీఎస్ విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డి.. తనకు-వైశాలికి పెళ్లి జరిగిందని, అందుకు రుజువులు ఉన్నాయంటూ ఈ ఏడాది ఆగస్టులో కోర్టులో పిటిషన్ వేశాడు. కానీ అతడి ఆరోపణలను వైశాలి కుటుంబం ఖండించింది. నవీన్ రెడ్డి పెళ్లి జరిగిందని చెబుతున్న తేదీన తాను ఆర్మీ కాలేజీ దంత వైద్యశాలలో చికిత్సలో ఉన్నానని చెబుతోంది వైశాలి. మీడియా మాట్లాడిన వైశాలి.. నవీన్ రెడ్డి మాటలు నమ్మోద్దని, అతడితో తన పెళ్లి జరగలేదని స్పష్టం చేసింది.

అతడు పెళ్లి జరిగింది అని చెప్పిన రోజున తాను ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని వైశాలి వెల్లడించింది. బ్యాడ్మింటన్ ఆడే సమయంలో అతనితో పరిచయం ఏర్పడగా.. పెళ్లి ప్రపోజల్ పెట్టాడని, అందుకు తాను అంగీకరించలేదని తెలిపింది. ఆ తర్వాత తమ కుటుంబ స్నేహితుడైన బుచ్చిరెడ్డి ద్వారా తన కుటుంబాన్ని సంప్రదించాడని తెలిపింది. అయితే, అతడిని తమ ఇంట్లోని వారు కూడా ఇష్టపడలేదని పేర్కొంది. తనను కాదని మరొకరిని పెళ్లి చేసుకోకుంటే తన జీవితం నాశనం చేస్తానని బెదిరించాడని, శుక్రవారం తమ ఇంటిపై దాడి చేసి బలవంతంగా లాక్కెళ్లారని వివరించింది. కారులో తీసుకెళుతూ తనను నవీన్ రెడ్డి తీవ్రంగా కొట్టాడని, తాను చెప్పినట్లు వినకపోతే తన తండ్రిని చంపేస్తామని బెదిరించారని వైశాలి ఆరోపించింది.
తన కళ్లెదురుగానే ఫోటోలను మార్ఫింగ్ చేశారని, శారీరకంగా హింసించారని వైశాలి వాపోయింది. ఇంతవరకూ తన తల్లిదండ్రులు కూడా తనపై చేయిచేసుకోలేదని, నవీన్ రెడ్డి దారుణంగా కొట్టాడంటూ గాయాలను మీడియాకు చూపించింది. తల్లిదండ్రులు కూడా తనపై ఎప్పుడూ చేయిచేసుకోలేదని, కానీ నవీన్ రెడ్డి తనను దారుణంగా కొట్టాడని గాయాల తాలూకు గుర్తులను వైశాలి మీడియాకు ప్రదర్శించింది. నీ ఇష్టంతో నాకు పనిలేదు.. నువ్వంటే నాకు ఇష్టం.. నువ్వు ఇంకెవర్నీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదని బెదిరించాడని వివరించింది. గతంలో తన పేరిట ఇన్ స్టాగ్రామ్ లో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి, మార్ఫ్ చేసిన ఫొటోలను అప్ లేడ్ చేసి వైల్ చేశాడని తెలిపింది.


Tags:    

Similar News