KCR : బీఆర్ఎస్ నేతలకు ఈసారి కూడా కేసీఆర్ షాకిచ్చారుగా?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ బయటకు రావడం లేదు.

Update: 2026-02-06 13:04 GMT

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ బయటకు రావడం లేదు. మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఆయన దూరంగా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ప్రచార బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపైనే పార్టీ అభ్యర్థుల గెలుపు ను ఉంచారు. కానీ అనుకున్నంత స్థాయిలో విజయం రాలేదు. పార్లమెంటు ఎన్నికల సమయంలోనే కేసీఆర్ బయటకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అప్పుడు ఒక్క పార్లమెంటు స్థానంలోనూ బీఆర్ఎస్ గెలవలేదు. తర్వాత జరిగిన ఏ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ దూరంగానే ఉన్నారు. కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమయంలోనూ ఆయన ప్రచారానికి రాలేదు.

ప్రచారానికి వస్తే..తమ గెలుపు...
ఇప్పుడు 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ తన అభ్యర్థులను కూడా బరిలోకి దింపింది. బీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన అభ్యర్థులు తమ పార్టీ అధినేత కేసీఆర్ ప్రచారానికి వస్తే తమ గెలుపు సులువవుతుందని నమ్ముతున్నారు. కేసీఆర్ ప్రసంగాలు తమ గెలుపునకు దోహదపడతాయని భావించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో పాటు దాదాపు అన్ని జిల్లా కేంద్రాలకు పట్టుకొమ్మలుగా ఉన్న కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ప్రచారానికి గడువు మరికొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. అయినా కేసీఆర్ ప్రచారానికి రాకపోవడంపై బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలో ఉన్నాయి.
ఇప్పుడు రాకుండా...
కేసీఆర్ ప్రచారానికి ఎందుకు రావడం లేదో తమకు అర్థం కావడం లేదని గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికలను సీరియస్ గా తీసుకోకుండా కేవలం శాసనసభ ఎన్నికల సమయానికి వస్తే ఎలా జనం ఆదరిస్తారన్న సందేహాలు పార్టీ కార్యకర్తలు నేరుగా ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్, హరీశ్ రావులు మాత్రమే ప్రచారం చేయడం సరికాదని, పార్టీ పెద్దగా ఆయన వస్తే తమకు భరోసా ఉంటుందని భావించిన కారు పార్టీ నాయకులకు ఈసారి కూడా కేసీఆర్ ఝలక్ ఇచ్చినట్లయింది. కార్పొరేషన్,మున్సిపాలిటీలో పోటీ చేయాలంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. పార్టీ కోసం తాము ఇంత చేస్తున్నా తమ కోసం కేసీఆర్ కనీసం జిల్లాల పర్యటనకు కూడా రాకపోవడాన్ని తప్పుపడుతున్నారు.




Tags:    

Similar News